కొచ్చి: కేరళలో విషాద ఘటన జరిగింది. నెడుంబస్సేరి ఎయిర్ పోర్ట్ రోడ్డుపై మినీ కూపర్ కారు స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు, ఒక యువకుడు స్పాట్లోనే చనిపోయారు. చనిపోయిన ముగ్గురినీ దేవిక, గోపిక, ఇజాజ్గా గుర్తించారు. మినీ కూపర్ డ్రైవ్ చేసిన సుహైల్ సజీవ్ను స్థానికులు పోలీసులకు అప్పగించారు.
నిందితుడు డ్రగ్స్ మత్తులో కారు డ్రైవ్ చేయడం వల్ల ఇలా జరిగిందేమోననే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు అథాని సిగ్నల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన మినీ కూపర్ కారు స్కూటీపై వెళ్తున్న ముగ్గురి ప్రాణాలను మింగేసింది.
యాక్సిడెంట్ తర్వాత కారు డ్రైవ్ చేసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు.. ఏం జరిగినా తన ఫ్యామిలీ చూసుకుంటుందని ధీమాగా అహంకారపూరితంగా మాట్లాడాడు. స్కూటీని కారు దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి ఆగింది.
చనిపోయిన ముగ్గురిలో గోపిక స్వస్థలం పాలక్కాడ్ కాగా, దేవిక స్వస్థలం వయనాడ్, ఇజాజ్ స్వస్థలం కర్ణాటక. ముగ్గురూ త్రికక్కరలోని ఒక హస్త కళల దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ రోడ్డులో టీ తాగిన ముగ్గురూ అథాని వైపు స్కూటీపై తిరిగి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.
