- మంత్రి తుమ్మల నాగేశ్వరావు
ఖమ్మం/వేంసూర్, వెలుగు : కొంతమంది రాజకీయాలు చేయడానికి ప్రాజెక్ట్ లను, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను ఆదివారం ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ పనులను వచ్చే నెల నాటికి పూర్తి చేసి ట్రయిల్ రన్ చేయాలని సూచించారు. డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్నారు. వచ్చే ఏడాదిలో నీళ్లు, విద్యుత్ ఉండక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గిపోయాయని, నీటిని పొదుపుగా వాడుకుంటూ సోలార్ తో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను రప్పించి పంటలు ఎండిపోకుండా చూస్తున్నామన్నారు.
అనంతరం సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, నాయకులు మట్టా దయానంద్, ప్రాజెక్ట్ మేనేజర్లు శ్రీకాంత్, పవన్, మున్సిపల్ చైర్మన్ రెహానా పాల్గొన్నారు.
