పాట్నా: సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలు దేశంలో అరాచకం సృష్టించే ప్రయత్నమేనని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. అయితే, పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సకాలంలో అణచివేసి అదుపులోకి తెచ్చిందన్నారు. కొద్దిరోజులుగా ఇదే అంశంపై ఆందోళనలు చేపట్టి ఢిల్లీ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీకి చెందిన ఎంపీ, జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై మౌనం వహించడాన్ని తప్పుబట్టారు.
పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ప్రజలు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ, అసాంఘిక శక్తులు ఆందోళనలను తమ స్వార్థ ఎజెండా కోసం వాడుకుంటే వారిని గుర్తించడం ముఖ్యం. నిన్న జరిగిన నిరసన అరాచకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే జరిగింది.
ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చింది' అన్నారు. ఎన్నికల్లో ఓటములను తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న పాశ్వాన్.. రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రజలు తమ పార్టీని తిరస్కరించారనే వాస్తవాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందన్నారు.
