- మహాలక్ష్మి స్కీమ్‌తో మహిళలకు ప్రయాణ స్వేచ్ఛ: మంత్రి పొన్నం
- నెక్లెస్ రోడ్డులో షీ పవర్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు
- ఉత్సాహంగా పాల్గొన్న మహిళా బైకర్లు
హైదరాబాద్, వెలుగు: మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, వారి రక్షణకు సమాజం బాధ్యత తీసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు.
మంత్రులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మహిళా బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల రక్షణ ప్రభుత్వం, పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, కుటుంబం, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతిని చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నేర్పించాలని సూచించారు.
కల్పనా చావ్లా, మహిళా క్రీడాకారులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని, తగిన అవకాశాలు కల్పిస్తే మహిళలు మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందని తెలిపారు.
మహిళలు నిర్భయంగా తిరిగేలా సమాజం సహకరించాలని కోరారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని, లైసెన్సుల జారీలో పారదర్శకత కోసం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలను విస్తరిస్తున్నామని చెప్పారు. మహిళల హక్కులు, రోడ్డు భద్రత నినాదాలతో సాగిన ఈ ర్యాలీ నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ, డీసీపీ శిల్పవల్లి, మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్‌పర్సన్ ప్రీతి రెడ్డి, సీబీఐటీ ప్రిన్సిపాల్ డా.నరసింహులు, షీ పవర్ ఫౌండేషన్ ప్రతినిధులు మనీష్, అపూర్వ శ్రీవాస్తవ, అల్పనా శరత్, మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
