క్యాప్టివ్ పవర్ పై కార్పొరేట్ల ఫోకస్..సొంతంగానే ప్లాంట్ల నిర్మాణం .. ఖర్చు తక్కువ.. భద్రత ఎక్కువ

 క్యాప్టివ్ పవర్ పై  కార్పొరేట్ల ఫోకస్..సొంతంగానే ప్లాంట్ల నిర్మాణం .. ఖర్చు తక్కువ.. భద్రత ఎక్కువ
  • యూనిట్​ఉత్పత్తి ఖర్చు రూ.6లోపే
  • సిమెంట్​, స్టీల్, ఆటో ​కంపెనీల్లో ఎక్కువ 

న్యూఢిల్లీ:కార్పొరేట్ కంపెనీలు క్యాప్టివ్  పునరుత్పాదక ఇంధనంవైపు (రెన్యువబుల్ ​ఎనర్జీ) మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ విద్యుత్ సరఫరా సంస్థలపై పూర్తిగా ఆధారపడకుండా, సౌర లేదా పవనశక్తి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా స్వయంగా కరెంటు తయారు చేసుకుంటున్నాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా భద్రత పెరగడంతోపాటు గ్రిడ్​పై ఆధారపడటం తగ్గుతోంది. 

డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి. ఉక్కు, సిమెంట్, మెటల్స్ వంటి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఆల్ట్రాటెక్ సిమెంట్​కు సుమారు 2 గిగావాట్ల, జేఎస్​డబ్ల్యూ స్టీల్ ఒక గిగావాట్, అంబుజా సిమెంట్స్​కు దాదాపు 980 మెగావాట్ల క్యాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. హిందాల్కో, టాటా స్టీల్ కూడా ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్ మరో 1.5 గిగావాట్ల, టాటా స్టీల్ 800 మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి.

నిర్వహణ వ్యయంలో కరెంటు వాటా 40 శాతం..

నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగంగా కంపెనీలు క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సెకండరీ స్టీల్ రంగంలో నిర్వహణ వ్యయంలో విద్యుత్ వాటా 40 శాతం వరకు ఉంటోంది. గ్రిడ్ చార్జీలు యూనిట్​కు రూ.7 నుంచి రూ.8 వరకు ఉండగా, పునరుత్పాదక విద్యుత్ రూ.4.5 నుంచి రూ.6 లోపే అందుబాటులో ఉంటోంది. 

భారీ పరిశ్రమలతో పాటు ఇతర రంగాలు గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తున్నాయి. మారుతీ సుజుకీ ప్లాంట్లలో 2026లో వాడిన విద్యుత్​లో పునరుత్పాదక శక్తి వాటా 23 శాతం కాగా, 2031 నాటికి దీన్ని 85 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేయనుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగంలో 78 శాతం, వాణిజ్య వాహన విభాగంలో 51 శాతం పునరుత్పాదక విద్యుత్​ను వినియోగిస్తోంది. 

రియల్ ఎస్టేట్, ఐటీనూ విస్తరణ

క్యాప్టివ్ గ్రీన్ పవర్ ట్రెండ్ కేవలం భారీ పారిశ్రామిక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వేగంగా విస్తరిస్తోంది. ఎంబసీ రీట్ కర్ణాటకలో వంద మెగావాట్ల సోలార్ పార్క్​ను నిర్వహిస్తోంది. దీంతో తన సొంత వ్యాపార కేంద్రాలకు నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్ సరఫరాను అందిస్తోంది. 

ఫలితంగా సంస్థలకు దీర్ఘకాలిక వ్యయ తగ్గింపు సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. వీవర్క్ ఇండియా సంస్థ బెంగళూరు కార్యకలాపాల ప్రత్యేక అవసరాల కోసం 10 మెగావాట్లపీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు పనులను ముమ్మరం చేసింది. 

ఈ సరికొత్త ప్రాజెక్ట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆ సంస్థ విద్యుత్ వినియోగంలో క్లీన్​ఎనర్జీ వాటా ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికి చేరుకుంటుంది. క్లీన్​ ఎనర్జీ వాడకం వల్ల పర్యావరణాన్ని దెబ్బతీసే కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయి.