నేషనల్ స్టీల్ పాలసీ డ్రాఫ్ట్.. ఉత్పత్తి పెంపే టార్గెట్..2047 నాటికి 60 కోట్ల టన్నుల ఎగుమతుల తగ్గింపుపై ఫోకస్

నేషనల్ స్టీల్ పాలసీ డ్రాఫ్ట్.. ఉత్పత్తి పెంపే టార్గెట్..2047 నాటికి 60 కోట్ల టన్నుల ఎగుమతుల తగ్గింపుపై ఫోకస్

న్యూఢిల్లీ: దేశీయ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2047 నాటికి 60.4 కోట్ల టన్నులకు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ 2047 ముసాయిదాను ఆదివారం విడుదల చేసింది. ఈ నూతన విధానం ఉక్కు రంగంలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు దిగుమతుల సవాళ్లను పరిష్కరించనుంది. 

దీని ప్రకారం.. 2047 నాటికి ఫినిష్డ్​ స్టీల్​ డిమాండ్ 505 మిలియన్ టన్నులకు, తలసరి వినియోగం 302 కిలోలకు, ఎగుమతులు 45 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. ఉక్కు తయారీ వ్యయంలో ముడిసరుకు వాటా 65 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. ఇనుప ఖనిజంలో భారత్ స్వయంసమృద్ధి సాధించినప్పటికీ, కోకింగ్ కోల్ అవసరాల్లో 92 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది.

 వీటిని తగ్గించేందుకు గనుల తవ్వకం, ఏఐ టెక్నాలజీలను ప్రోత్సహించనున్నారు. దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో 47 శాతం వాటా కలిగిన 2,550 సెకండరీ స్టీల్ యూనిట్లకు ముడిసరుకు, నైపుణ్యాభివృద్ధిలో మద్దతు ఇస్తారు. 

ఉక్కు రంగం నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను తగ్గించి, 2070 నాటికి నెట్ జీరో సాధించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. స్క్రాప్ వినియోగం పెంచడం, హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వాడకం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. 

నాణ్యత లేని ఉక్కు దిగుమతులను నిరోధించేందుకు ఏఐ టెక్నాలజీలను వాడుతారు. మనదేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి 2015లో 89 మిలియన్ టన్నుల నుంచి 2026 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని ఈ డ్రాఫ్ట్​ పేర్కొంది.