కాంగ్రెస్‌‌‌‌ పార్టీది ద్వంద్వ నీతి..ఢిల్లీలో ఒక న్యాయం.. గల్లీలో ఇంకో న్యాయమా : కేంద్రమంత్రి జి. కిషన్‌‌‌‌ రెడ్డి 

కాంగ్రెస్‌‌‌‌ పార్టీది ద్వంద్వ నీతి..ఢిల్లీలో ఒక న్యాయం.. గల్లీలో ఇంకో న్యాయమా  : కేంద్రమంత్రి జి. కిషన్‌‌‌‌ రెడ్డి 
  • హామీలపై నిలదీస్తే  తెలంగాణలో నిర్బంధాలా?
  • కేంద్రమంత్రి జి. కిషన్‌‌‌‌ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ పేరిట కాంగ్రెస్ పార్టీ కపట రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీకి ఆదినుంచీ ద్వంద్వ వైఖరే అలవాటని కేంద్ర మంత్రి జి. కిషన్‌‌‌‌ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గొంతు చించుకునే కాంగ్రెస్ పెద్దలు.. అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం విపక్షాల గొంతు నొక్కుతున్నాయని తెలిపారు.

దేశంలో నిర్బంధ ప్రజాస్వామ్యం కొనసాగుతోందంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలు సిగ్గుచేటన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ నేతలు ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను గౌరవించిందని ఆయన చెప్పారు. ప్రియాంక గాంధీ రోడ్డుపై బైఠాయించినా, రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కినా పోలీసులు అడ్డుకోలేదని గుర్తుచేశారు.     

రాజ్యాంగం చేతిలో పట్టుకుంటే సరిపోదు

రాహుల్ దేశమంతా తిరుగుతూ ప్రధాని మోదీతో పాటు సైన్యం, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నా మాట్లాడే హక్కును ఎన్నడూ కాలరాయలేదని  కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌‌‌‌లో రాష్ట్ర మంత్రులే స్వయంగా లోక్‌‌‌‌భవన్‌‌‌‌ను ముట్టడించినప్పుడు రాని శాంతిభద్రతల సమస్య.. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడితేనే వస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన మొదలుకొని రైతు గోస -బీజేపీ భరోసా, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ దీక్షలు, భూభారతి బాధితుల పక్షాన నిర్వహించిన మహాధర్నా, చలో అసెంబ్లీ వరకు ప్రతి ప్రజాస్వామిక ఉద్యమాన్ని పోలీసు పహారాతో అణచివేశారని విమర్శించారు. ఖర్గే రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదనీ, అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని కోరారు. రాహుల్, ప్రియాంక చెప్పే మొహబ్బత్ కీ దుకాన్ అంటే విపక్షాలపై నిర్బంధాలు విధించడమేనా అని ప్రశ్నించారు.