- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షలాది మంది అర్హులు తమ ఓటు హక్కును కోల్పోయారని, ఆధారాలతో బాధితులందరినీ తీసుకొస్తానని, తేదీ, స్థలం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనలను తప్పు పట్టడం, ఓటు కోల్పోయినవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించడం సరికాదన్నారు.
ఓటర్ల జాబితా సవరణ అనేది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలన్నారు. దేశవ్యాప్తంగా సుమారు13 కోట్ల ఓట్లు, రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సవరణల పేరుతో తొలగించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించారన్న మంత్రి పొన్నం.. ఓటర్ల జాబితాలో జరిగిన సవరణలు, తొలగింపులపై ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ, ఇంకా అదనపు ఆధారాలు సమర్పించాలని కోరడం వల్ల పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు తమ హక్కును నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి సత్తయ్య, సత్యనారాయణ గౌడ్ వంటి పేర్లలో వ్యత్యాసాల సాకుతో స్వయంగా తన ఓటును తొలగించే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును కాపాడుకోవడానికి వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
