జిబౌటి సిటీ: ఆఫ్రికా దేశం జిబౌటి తీరంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉపాధి కోసం వెళ్తున్న వలసదారుల పడవ సముద్రంలో మునిగిపోవడంతో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటనలో మరో 86 మంది గల్లంతు కాగా, 80 మంది క్షేమంగా బయటపడ్డారని ఐక్యరాజ్యసమితికి చెందిన వలసల సంస్థ (ఐఓఎమ్) వెల్లడించింది.
వారంతా ఇథియోపియా దేశానికి చెందినవారని తెలిపింది. జిబౌటి నుంచి యెమెన్‌కు వలసదారులను తరలిస్తుండగా గుహెరే సమీపంలో అక్టోబర్ 8న రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు. ఈ ప్రమాదంపై జిబౌటిలోని ఐఓఎం మిషన్ చీఫ్ అలెగ్జాండర్ కొయిసాక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం స్థానిక అధికారులతో కలిసి తమ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయని, ప్రాణాలతో బయటపడిన 64 మందికి అత్యవసర వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు.
