రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ తర్వాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రకటించినా వివిధ కారణాలతో ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ అందింది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకోవడంతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యిందట. దీంతో ఇక ఆలస్యం చేయకుండా సినిమాను ప్రారంభించేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం.
డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. రామ్ చరణ్ కెరీర్‌లో 17వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తీసిన సుకుమార్.. ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ మూవీ తీయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సుకుమార్ తీసిన చిత్రాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈ సినిమాకు మాత్రం అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అలాగే రష్మిక లేదా రుక్మిణి వసంత్‌లో ఒకరు హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
