కార్మికులకు భరోసా సింగరేణి సమస్యలపై సర్కార్ నజర్

కార్మికులకు భరోసా సింగరేణి సమస్యలపై సర్కార్ నజర్
  •      ఏరియా స్థాయిలోనే మెడికల్ బోర్డు నిర్వహణ
  •     15 రోజుల్లోగా డిపెండెంట్ ఉద్యోగాలు, 1250 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు
  •     ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం 
  •     కార్మికులు, వారి కుటుంబాల్లో చిగురిస్తున్న ఆశలు 


కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై సర్కార్​దృష్టి పెట్టింది. డిపెండెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, వైద్య సేవలు, కార్మికుల భద్రతతో పాటు పెండింగ్‌‌‌‌‌‌‌‌ సమస్యలను పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 6న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో సింగరేణి సమస్యలపై చర్చించారు. మంత్రులు వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు, సీఎండీ, డైరెక్టర్లు, ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ లీడర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో కార్మికులు, వారి కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఏరియా ఆస్పత్రుల్లోనే మెడికల్‌‌‌‌‌‌‌‌ బోర్డులు..

సింగరేణిలో 2018 మార్చి 9 నుంచి కారుణ్య నియామకాల పేరిట మెడికల్​ బోర్డు నిర్వహిస్తోంది. కొత్తగూడెంలోని మెయిన్​ ఏరియా ఆస్పత్రిలో బోర్డు నిర్వహణ సాగుతోంది. అయితే ఏరియా స్థాయిలోనే బోర్డు నిర్వహణ చేయాలనే డిమాండ్​ ఉంది. దీంతో అనారోగ్యంతో విధులకు అనర్హులుగా గుర్తించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటివరకు మెడికల్‌‌‌‌‌‌‌‌ బోర్డు కోసం కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుండగా, ఇకపై సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లోనే నిర్ణీత వ్యవధిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో కార్మికులకు ప్రయాణ ఖర్చులు, దూరభారం తగ్గనున్నాయి.

15 రోజుల్లో డిపెండెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు..

పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సుమారు 300 డిపెండెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, 15 రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం యాజమాన్యాన్ని ఆదేశించింది. మరో 136 మంది డిపెండెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల పేర్ల మార్పు సమస్యను అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా పరిష్కరించనున్నారు. కరోనా సమయంలో, ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరుకాక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు వన్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌ కింద తిరిగి ఉద్యోగాలు కల్పించే అంశంపైనా నిర్ణయం తీసుకున్నారు.

అర్హులకు ఇళ్ల స్థలాలు..

సింగరేణికి కేటాయించిన భూముల్లో మిగిలి ఉన్న సుమారు 1,250 ఎకరాల్లో అర్హులకు జీవో నంబర్‌‌‌‌‌‌‌‌ 76 ప్రకారం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే ప్రక్రియను స్పీడప్​చేయాలని నిర్ణయించారు. అలాగే మైనింగ్‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలు లేని ప్రాంతాల్లో నెహ్రూ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ కాలనీలు ఏర్పాటు చేయనున్నారు. శిథిలమైన డీ-టైప్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్ల స్థానంలో మెరుగైన వసతులతో కొత్త నివాసాలను నిర్మించి నెహ్రూ పేరిట సింగరేణి కాలనీలు ఏర్పాటు చేయనున్నారు. 

మెరుగైన వైద్య సేవలు..

సింగరేణి ఏరియా ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ వైద్యుల నియామకంతో పాటు కార్డియాక్‌‌‌‌‌‌‌‌ సేవలు, క్యాథ్‌‌‌‌‌‌‌‌ల్యాబ్‌‌‌‌‌‌‌‌ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సింగరేణి ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉచిత క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఇతర సమస్యల పరిష్కరానికి చర్యలు..

గనుల్లో కార్మికుల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రతి ఆరు నెలలకోసారి సేఫ్టీ కిట్లు అందించాలని నిర్ణయించారు. సింగరేణి బకాయిల చెల్లింపు, పెర్క్స్‌‌‌‌‌‌‌‌పై ఆదాయపు పన్ను రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలపై ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. ప్రభుత్వ స్కూల్స్​, కళాశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్‌‌‌‌‌‌‌‌ ప్యానెళ్ల ఏర్పాటు, ఖాళీ భూములు, ఓబీ గుట్టలపై సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటు, రామగుండంలో థర్మల్‌‌‌‌‌‌‌‌ కేంద్రం, భూపాలపల్లిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై సింగరేణి కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.