బకాయిలు కట్టకుండానే.. మిల్లులను అమ్మేస్తున్నరు ..చేతులు మారుతున్న డీఫాల్ట్ రైస్ మిల్లులు..

బకాయిలు కట్టకుండానే.. మిల్లులను అమ్మేస్తున్నరు ..చేతులు మారుతున్న డీఫాల్ట్  రైస్ మిల్లులు..
  •  సివిల్ సప్లై శాఖ ఎన్ వోసీ లేకుండానే రిజిస్ట్రేషన్లు 
  • అడిషనల్ కలెక్టర్ ఆదేశాలూ పట్టించుకోని రిజిస్ట్రేషన్ల శాఖ
  • తాజాగా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లో మిల్లు అమ్మకం 
  • రిజిస్ట్రేషన్ల శాఖ తీరుపై అనుమానాలు

 కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లోని ఓ మిల్లు యజమాని 2022=23 రబీ సీజన్ కు సంబంధించి సర్కార్ కు రూ.6.19 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1న జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. దీంతో మిల్లు ఓనర్ రూ.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆగస్ట్ నెలలో మిల్లును అమ్మకానికి పెట్టారు. 

సివిల్ సప్లై శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) సమర్పిస్తేనే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఎలాంటి ఎన్వోసీ లేకుండానే గంగాధర సబ్ రిజిస్ట్రార్ మిల్లును రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది.  

కరీంనగర్, వెలుగు :  ప్రభుత్వానికి కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిపడి డీఫాల్టర్ల జాబితాలో చేరిన కొందరు రైస్ మిల్లర్లు.. తమ మిల్లులను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ కింద డీఫాల్టర్ల ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మిల్లులను ఇతరులకు విక్రయిస్తూ సేఫ్ జోన్ లోకి వెళ్తున్నారు.

 సర్కార్ కు ఎలాంటి బకాయిలు లేవని సివిల్ సప్లై శాఖ నుంచి ఎన్వోసీ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలని, లేదంటే రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని అడిషనల్ కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిజిస్ట్రార్లు వాటిని పాటించడం లేదు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లో రూ.6.19 కోట్లు బకాయి ఉన్న మిల్లును ఇతరులకు విక్రయించడం, రిజిస్ట్రేషన్ జరిగిపోవడం ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్ గా మారింది. 

ఎన్వోసీ లేకుండానే రిజిస్ట్రేషన్లు

సివిల్ సప్లై శాఖ ప్రతి సీజన్ లో ఒక్కో మిల్లుకు కోట్ల రూపాయల విలువైన వేలాది టన్నుల ధాన్యాన్ని అప్పగిస్తోంది. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్ సీఐకి బియ్యం అప్పగించాలి. కోట్లాది రూపాయల ధాన్యం తీసుకున్న మిల్లర్లు దారి మళ్లించే ప్రమాదం ఉండడంతో.. బకాయిలు చెల్లించే వరకు వారి పేర్లపై ఉన్న మిల్లులను అమ్ముకోకుండా, ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఆఫీసర్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. 

అందుకే డీఫాల్టర్ల జాబితాను అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ప్రతి ఏటా జిల్లా రిజిస్ట్రార్ కు పంపిస్తుంటారు. అంతేగాక తాము ఎన్వోసీ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధన సైతం విధించారు. డీఫాల్టర్లతో పాటు జిల్లాలో ఏ రైస్ మిల్లునైనా రిజిస్ట్రేషన్, పార్టిషన్ డీడ్ చేయాలన్న ఎన్వోసీ తప్పనిసరి అని గతంలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. కానీ తమకు పంపిన జాబితాలో మిల్లు పేరు లేదన్న సాకుతో ఎన్వోసీ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో ఆ శాఖ ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రెండు శాఖల మధ్య 'రిజిస్ట్రేషన్' చిచ్చు

డీఫాల్టర్లకు చెందిన మిల్లులతో పాటు జిల్లాలో ఏ రైస్ మిల్లు రిజిస్ట్రేషన్ కావాలన్నా తమ ఎన్వోసీ ఉండాలని గతంలో పలుమార్లు జిల్లా రిజిస్ట్రార్ కు లేఖ రాశామని జిల్లా సప్లై శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. తాము పంపిన డీఫాల్టర్ల జాబితాలో లేని, గతంలో ధాన్యం కేటాయించని మిల్లుల రిజిస్ట్రేషన్ కు సైతం ఎన్వోసీ తెచ్చుకోవాలని తమ దగ్గరికి పంపారని వారు గుర్తు చేస్తున్నారు. 

గోపాల్ పూర్ మిల్లు విషయంలో మాత్రం ఎన్వోసీ నిబంధనను పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, రిజిస్ట్రేషన్ల శాఖ డీజీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా... సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన లిస్ట్ లో పేరు లేకపోవడం వల్లే రిజిస్ట్రేషన్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది చెబుతున్నారు.