తెలంగాణ కుంచెకు ఢిల్లీ సలాం!. రాష్ట్రపతి భవన్‌లో చేర్యాల చిత్రాలు

తెలంగాణ కుంచెకు ఢిల్లీ సలాం!. రాష్ట్రపతి భవన్‌లో చేర్యాల చిత్రాలు

తెలంగాణ మట్టిలో పుట్టిన కళ.. దేశ రాజధాని ఢిల్లీలో వెలిగింది!ఒకప్పుడు పల్లె గోడలపై కథలు చెప్పిన కుంచె.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌ గోడలను అలంకరించింది. 16 రోజుల ఆర్టిస్ట్‌-ఇన్‌-రెసిడెన్స్‌ కార్యక్రమంలో తెలంగాణ కళాకారులు తమ కుంచెకు పదును పెట్టారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సంప్రదాయ చిత్రకళకు దేశ అత్యున్నత భవనంలో అరుదైన గౌరవం దక్కింది.


తెలంగాణలోని పురాతన చేర్యాల స్క్రోల్ పెయింటింగ్​లకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో తెలంగాణ సంప్రదాయ చేర్యాల చిత్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో16 రోజుల పాటు నిర్వహించిన ఆర్టిస్ట్- ఇన్ -రెసిడెన్స్ కార్యక్రమంలో తెలంగాణ చేర్యాల నకాషీ కళాకారులు ధనాలకోట నాగేశ్వర్, శ్రవణ్ కుమార్, సాయికిరణ్‌లను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేశంలో పురాతన సంప్రదాయ కళలకు గుర్తింపునిస్తూ సాక్షాత్తూ రాష్ట్రపతి పలు రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులను ఢిల్లీ శిబిరానికి పిలిచారు.

తెలంగాణలోని చేర్యాల నకాషీ కళాకారులతోపాటు రాజస్థాన్ లోని ఫద్, కేరళలోని మ్యూరల్, బిహార్ లోని మధుబనీ, మధ్యప్రదేశ్ లోని గోండ్, ఒడిశాలోని పట్టచిత్ర కళాకారులను పిలిచి వారితో 16 రోజుల పాటు ఆయా కళల కళాఖండాలను చిత్రీకరింప జేసి వాటిని రాష్ట్రపతి భవన్​లో అలంకరించారు. కళాకారులకు రాష్ట్రపతి భవన్ లోనే వసతి సౌకర్యాలు కల్పించి వారితో వికసిత్ భారత్ థీమ్​తో కళాఖండాలను రూపొందింపజేశామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్​లో పోస్టు చేశారు.

వికసిత్ భారత్ శ్రమశక్తి పెయింటింగ్

రాష్ట్రపతి నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానంపై తాము ఢిల్లీ వెళ్లి16 రోజులపాటు రాష్ట్రపతి భవన్ లోనే ఉండి వికసిత్ భారత్ థీమ్ తో శ్రమశక్తి ఫ్రంట్ లైన్ సర్వీసెస్ పేరిట తాము చేర్యాల పెయింటింగ్​లు వేశామని ధనాలకోట సాయికిరణ్ చెప్పారు. కాన్వాస్ పై అక్రిలిక్ రంగులను ఉపయోగించి బ్రష్ ల సాయంతో తాము అగ్నిమాపకశాఖ, వైద్య, విద్య రంగాల సేవాశక్తిని ప్రదర్శించేలా తాము రెండు పెద్ద పెయింటింగులు వేశామని ధనాలకోట నాగేశ్వర్ చెప్పారు. తాము వేసిన వైవిధ్యమైన చేర్యాల చిత్రకళ పెయింటింగ్​లను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు. 16 రోజులపాటు తాము వేసిన కళాఖండాలను రాష్ట్రపతి భవన్ కు అందించామని ధనాలకోట శ్రవణ్ కుమార్ చెప్పారు. ఈ ఆర్టిస్ట్- ఇన్ -రెసిడెన్స్ కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల కళాకారులు తమ తమ కళాఖండాలను చిత్రీకరించి అందించామని ఆయన వివరించారు.

చేర్యాల కళాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు

రాష్ట్రపతి సమక్షంలో చేర్యాల చిత్రకళ కళాకారులు ధనాలకోట నాగేశ్వర్, శ్రవణ్ కుమార్, సాయికిరణ్‌లు పలు పెయింటింగులు వేసి చూపించారు. తమ పురాతన కళను ప్రదర్శించిన చేర్యాల చిత్రకళాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ చేర్యాల చిత్రకళ వైభవాన్ని చాటి చెప్పారు. ముగ్గురు చేర్యాల కళాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాలువ కప్పి, 24 క్యారట్ గోల్డ్ మెమోంటోను ఇచ్చి సత్కరించారు.

తాము వేసిన పెద్ద పెయింటింగులను రాష్ట్రపతి భవన్​లో ప్రదర్శించడం మర్చిపోలేని మధుర అనుభూతిని అందించిందని ధనాలకోట నాగేశ్వర్ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేర్యాల పెయింటింగ్‌ను విశ్వవ్యాప్తం చేయడంతోపాటు ఈ ప్రాచీన కళను కాపాడటంలో ధనాలకోట సాయికిరణ్ చేసిన కృషిని గుర్తించి ఈ జాతీయ గౌరవాన్ని అందించారు.

 విదేశాలకు చేరిన చేర్యాల పెయింటింగ్స్ ఖ్యాతి

తెలంగాణ రాష్ట్రంలోని చేర్యాల స్క్రోల్ పెయింటింగుల ఖ్యాతి విదేశాలకు చేరింది. చేర్యాల కళాకారులు వివిధ దేశాల్లోనూ తమ పెయింటింగ్​లు వేసి వారి ప్రశంసలు అందుకున్నారు. చేర్యాల పెయింటింగ్ కళాకారిణి ధనాలకోట పద్మ జర్మనీ, మలేషియా దేశాల్లో పర్యటించి అక్కడ కళను ప్రదర్శించారు. ధనాలకోట పద్మ వేసిన పెయింటింగులకు ఆయా దేశాల ప్రజల నుంచి అభినందనలు వచ్చాయి. చేర్యాల కళాకారుడు ధనాలకోట నాగేశ్వర్ బ్యాంకాక్ దేశంలో ధనాలకోట సాయికిరణ్ స్పెయిన్​లో పర్యటించి అక్కడ చేర్యాల పెయింటింగులు వేసి విక్రయించారు. ధనాలకోట నాగేశ్వర్ బ్యాంకాక్​లో చేర్యాల ఆర్ట్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చేర్యాల కళాకారుల కుటుంబంలో తాతలు, ముత్తాతల కాలం నాటి నుంచి మూడు తరాలుగా కళాకారులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒకే కుటుంబంలో నలుగురు కళాకారులు చేర్యాల కళాఖండాలను రూపొందిస్తున్నారు.తెలంగాణ మట్టి వాసనతో పుట్టిన ఈ కళ.. రాష్ట్రపతి భవన్‌ వేదికగా దేశం నలుమూలలకు తన వైభవాన్ని చాటింది. చేర్యాల కుంచె కదిలింది.. ఢిల్లీ మెచ్చింది! పల్లె కళకు రాష్ట్రపతి భవన్‌ పట్టం కట్టింది! 

చేర్యాల చిత్రకళ ప్రత్యేకతలు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామం వేదికగా పుట్టిన ఈ నకాషీ (చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్) కళకు 800 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. పూర్వ కాలంలో టీవీలు, సినిమాలు లేని రోజుల్లో కాకీ పడగొల్ల వారు గ్రామాల వెంబడి తిరుగుతూ రామాయణ, మహాభారత ఘట్టాలను, పురాణ గాథలను ప్రజలకు వివరించడానికి ఈ చేర్యాల చిత్ర పటాలను ఒక దృశ్య మాధ్యమంగా ఉపయోగించేవారు.ఖాదీ లేదా కాటన్ వస్త్రాలపై చింతపిక్కల పొడి, సుద్దమట్టి, సహజసిద్ధమైన చెట్ల వేర్లు, రాళ్ల నుంచి సేకరించిన రంగులతో ఈ చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దుతారు.బొల్లారంలోని రాష్ట్రపతి వేసవి విడిది అయిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో చేర్యాల పెయింటింగ్ లు రాష్ట్రపతి నిలయం టన్నెల్ లో రెండు వైపులా గోడలపై చేర్యాల పెయింటింగ్ లు వేసి ఔరా అనిపించారు. గోడలపై చేర్యాల పెయింటింగ్ లను చూసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేర్యాల కళాకారులను అభినందించారు. 

చేర్యాల చిత్రకళకు జీఐ ట్యాగ్

తెలంగాణకు చెందిన ఈ విశిష్ఠమైన చేర్యాల చిత్ర కళారూపానికి 2010వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు  లభించింది.తరాలు మారుతున్నా, ఆధునిక కాలంలో అంతరించిపోతున్న ఈ తెలంగాణ అపురూప కళను సజీవంగా ఉంచుతూ... దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడం ద్వారా తెలంగాణ చేర్యాల చిత్రకళా కీర్తి మరింత ఉజ్వలమైంది.