- ఈ వార్త మీడియా ద్వారానే తెలిసిందని జెలెన్‌స్కీ సెటైర్
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు ఇంధన మౌలిక వసతులపై ఒకరిపై మరొకరు దాడులు చేసుకోకుండా ఎనర్జీ సీజ్ ఫైర్ (ఇంధన కాల్పుల విరమణ) ఒప్పందానికి అంగీకరించాయని తెలిపారు. ఈ అగ్రిమెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’ లో ఒక పోస్ట్ పెట్టారు.
“రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇందుకు రెండు దేశాలూ అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ భగ్నం చేయకూడదు” అని పేర్కొన్నారు. అయితే, ఈ కాల్పుల విరమణ ఎంతకాలం అమల్లో ఉంటుంది? దీనిని ఎలా పర్యవేక్షిస్తారు? అనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే ఈ ప్రకటనపై వైట్‌హౌస్ లేదా క్రెమ్లిన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు.
రష్యా దాడులు ఆపితే.. మేమూ ఆపేస్తాం
ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. ఈ వార్త తనకు మీడియా ద్వారానే తెలిసిందని, ట్రంప్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందని సెటైర్లు వేశారు. “రష్యా గనుక ఇంధన కాల్పుల విరమణకు అంగీకరిస్తే ఉక్రెయిన్ కూడా అందుకు సిద్ధంగా ఉంది.
ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయమై పుతిన్‌తో మాట్లాడి ఉంటే, ఆ కాల్పుల విరమణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో దయచేసి మాకు కూడా చెప్పాలి. ఈ ఒప్పందానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా రిఫైనరీలపై దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్న జెలెన్‌స్కీ, అదే సమయంలో రష్యా కూడా తమ దేశంలోని ఇంధన మౌలిక వసతులపై దాడులను ఆపాలనే ప్రధాన షరతును విధించారు.
