సిటీలో సోలార్ వెలుగులు.. ఇంటిపై సోలార్‌‌ వేస్తే నెలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ 

సిటీలో సోలార్ వెలుగులు.. ఇంటిపై సోలార్‌‌ వేస్తే నెలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ 
  • పీఎం సూర్యఘర్ కింద  4,749 మంది దరఖాస్తు  
  • ఇప్పటికే ఉన్న కస్టమర్లకు రూ.23.81 కోట్ల సబ్సిడీ  
  • ఇంటిపై సోలార్‌‌ వేస్తే నెలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : విద్యుత్ ఛార్జీల భారం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు సోలార్ విద్యుత్ వైపు చూస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీం ద్వారా ఇండ్లపై రూఫ్‌‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘పీఎం సూర్య ఘర్’ కింద ఇప్పటివరకు 44,662 దరఖాస్తులు రాగా, 29,816 ఓకే అయ్యాయి. హైదరాబాద్ మెట్రో జోన్‌‌లో 2026 ఆగస్టు చివరి నాటికి 4,749 మంది 22.33 మెగా వాట్ల సోలార్ పవర్ కోసం అప్లై చేసుకోగా, 3,615 మంది ఇన్‌‌స్టాలేషన్ ( 15.70 మెగావాట్ల) వివరాలు సమర్పించారు. 3,346 మందికి (14.43 మెగావాట్ల ) ఇన్​స్పెక్షన్​ కూడా పూర్తయ్యింది. ఇప్పటికే సోలార్​పవర్​వాడుతున్న 2,995 మంది ఖాతాల్లోకి రూ. 23.81 కోట్ల సబ్సిడీ సొమ్ము కూడా జమయ్యింది. 

అర్హతలు ఇవి..

స్కీంకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారునికి సొంత ఇల్లు ఉండి, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కనీసం ప్రతి 1 కిలో వాట్ కు  కి 80–100 చదరపు అడుగుల పై కప్పు (రూఫ్‌‌టాప్) స్థలం ఉండాలి. యాక్టివ్ కరెంట్ కనెక్షన్ కలిగి ఉండటంతో పాటు, గతంలో ఎటువంటి ప్రభుత్వ సోలార్ సబ్సిడీని పొంది ఉండకూడదు. వినియోగదారులు https://pmsuryaghar.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక కిలోవాట్​కు ఇన్ని నడుస్తయ్​

ఒక కిలో వాట్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్​చిన్న కుటుంబాలకు, తక్కువ కరెంట్ వినియోగం ఉన్న ఇళ్లకు సరిపోతుంది. రోజుకు 4 నుంచి 5యూనిట్ల కరెంట్​వస్తుంది కాబట్టి దీన్ని ఒకేసారి 3 నుంచి 4 ఎల్‌‌ఈడీ బల్బులు వెలగడానికి, 2 నుంచి 3 సీలింగ్ ఫ్యాన్లు తిరగడానికి, టీవీ, చిన్న ఫ్రిజ్ నడిపించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, మొబైల్ అండ్ లాప్‌‌టాప్ ఛార్జింగ్​పెట్టుకోవచ్చు. పగటిపూట ఎండ బాగా ఉన్న టైంలో ఫ్యాన్లు, ఫ్రిజ్ లు ఆపేసి కేవలం కూలర్ లేదా వాషింగ్ మెషీన్​వాడుకోవచ్చు. ఒక కిలో వాట్ సిస్టమ్‌‌పై ఏసీ అస్సలు నడవదు. 

రెండు కిలోవాట్లకు..  

ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా అనువైనది. రోజుకు సగటున 8 నుంచి 10 యూనిట్ల కరెంట్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఒకేసారి 5 నుంచి 6 ఎల్‌‌ఈడీ బల్బులకు, 3  నుంచి 4 సీలింగ్ ఫ్యాన్లు తిరగడానికి, ఒక పెద్ద ఫ్రిజ్, టీవీ నడిపించుకోవచ్చు. వీటితో పాటు ఒక కూలర్ లేదా ఒక వాషింగ్ మెషీన్ ను రన్​ చేసుకోవచ్చు. వాటర్ మోటార్ (0.5 హెచ్‌‌పీ నుంచి 1 హెచ్‌‌పీ  మోటార్‌‌ను పగటిపూట మిగతా పెద్ద వస్తువులు ఆపేసి అరగంట వేసుకోవచ్చు). ఒక టన్ను ఇన్వర్టర్ ఏసీని పగటిపూట నడుపుకోవచ్చు. కానీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, కూలర్ లను బంద్ చేయాల్సి ఉంటుంది.

మూడు కిలోవాట్లకు.. 

ఇది టన్​లేదా 1.5 టన్​ఏసీలు, వాటర్ మోటార్లు క్రమం తప్పకుండా వాడే ఇండ్లకు సరిపోతుంది. రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల కరెంట్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకేసారి  8  నుంచి 10  ఎల్‌‌ఈడీ  బల్బులు, 4  నుంచి 5 సీలింగ్ ఫ్యాన్లు, రెండు టీవీలు, డబుల్ డోర్ ఫ్రిజ్,  1.5 టన్​​ఇన్వర్టర్ ఏసీ పగటిపూట నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఏసీ నడుస్తున్నప్పుడే ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్ కూడా వాడుకోవచ్చు. ఏసీ బంద్ చేసిన టైంలో ఒకేసారి కూలర్ , వాషింగ్ మెషీన్ రెండింటినీ కలిపి వాడుకోవచ్చు. అలాగే 1 హెచ్‌‌పీ వాటర్ మోటార్‌‌ను కూడా రన్​ చేసుకోవచ్చు.  
 
కరెంట్​ మిగిలితే..అమ్ముకోవచ్చు 

ఈ  స్కీం కింద ఒక కిలో వాట్​కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానెళ్లకు సుమారు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు అవుతుండగా..కేంద్రం రూ. 30 వేల సబ్సిడీ ఇస్తుంది. రోజుకు 4 నుంచి 5యూనిట్లు..నెలకు150 యూనిట్ల వరకు విద్యుత్​ఉత్పత్తి అవుతుంది.  ఇక 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లకు రూ.1.10 లక్షల నుంచి 1. 30 లక్షల వరకు అవుతుండగా, రూ. 60 వేలు సబ్సిడీ ఇస్తారు. 150–300 వరకు యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

 ఒక వేళ అంత కరెంట్ వాడుకోకపోతే మిగిలినది గ్రిడ్‌‌కు అమ్ముకుని అదనపు ఆదాయం పొందవచ్చు. మరో స్లాబ్​లో 3  కిలోవాట్ల సోలార్ యూనిట్లకు రూ.1. 90 లక్షల నుంచి 2. 10 లక్షల వరకు ఖర్చవుతుంది. రూ. 78 వేల సబ్సిడీ వస్తుంది. రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల వరకు కరెంట్‌‌ ఉత్పత్తి అవుతుంది. వీటికి తక్కువ వడ్డీకే బ్యాంక్ లు లోన్లు ఇస్తుండడంతో దరఖాస్తులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.