ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ ఎమర్జెన్సీ విధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేపట్టడం, ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం సిఫార్సుల మేరకు ప్రెసిడెంట్ జర్దారీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రధాని షరీఫ్ ఆరోపించారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై పీటీఐ చైర్మన్ గోహర్ అలీ ఖాన్ మండిపడ్డారు. ఇది అప్రజాస్వామిక చర్య అని, ప్రజల హక్కులకు వ్యతిరేకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనను విడుదల చేయాలని, వైద్యులను కలిసేందుకు అనుమతించాలని కోరుతూ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆందోళనలు పెరిగాయి.
