గచ్చిబౌలి, వెలుగు: క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు గుర్తింపు, క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం లక్ష్యంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ ఫర్ గ్రేస్.. స్క్రీన్ ఫర్ లైఫ్ అనే నినాదంతో ఆదివారం గచ్చిబౌలిలో రన్ నిర్వహించింది. ఇందులో 35 వేలమంది రన్నర్లు పాల్గొన్నారు. వీరిలో 300 మంది క్యాన్సర్ విజేతలు, ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు ఉన్నారు. రన్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రారంభించగా.. మరో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి బహుమతులను అందజేశారు. సీఎం హాజరుకాకపోవడంతో ఆయన సందేశాన్ని చదివి వినిపించారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను పేదలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించడం అభినందనీయమన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తాను 2005లో క్యాన్సర్ బారిన పడ్డానని, అమెరికాలో చికిత్స పొంది కోలుకున్నానని తెలిపారు. డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, సినీ నటి అనస్వర రాజన్ పాల్గొన్నారు.
