పంజాగుట్ట, వెలుగు : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని, దీనికోసం అన్ని జర్నలిస్టు సంఘాలను, యూనియన్లను కలుపుకొని కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు ఎస్. విజయకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టులు, సభ్యులు హాజరయ్యారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, వయోధిక పాత్రికేయులకు పెన్షన్లను ఇవ్వాలని, వీటన్నింటి సాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తీర్మానించింది.
అలాగే, మరణించిన ప్రెస్ క్లబ్ సభ్యుడి కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం తక్షణం అందజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు ఏ.రాజేష్, అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్ , వర్ధిల్లి బాపూరావు, ట్రెజరర్రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, ఆర్ .శైలేష్ రెడ్డి, దిలీప్ రెడ్డి, రవి కాంత్ రెడ్డి, యూసుఫ్ బాబు హాజరయ్యారు.
