విమానంలో పేలిన పవర్ బ్యాంక్..ఢిల్లీ–చెన్నై ఇండిగో ఫ్లైట్‎కు తప్పిన పెను ప్రమాదం

విమానంలో పేలిన పవర్ బ్యాంక్..ఢిల్లీ–చెన్నై ఇండిగో ఫ్లైట్‎కు తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ లోపల మంటలు చెలరేగి, పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్‌‌‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరిన ఎయిర్‌‌‌‌బస్ ఏ321 విమానం చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ ఓవర్‌‌‌‌హీట్ అయి మంటలు అంటుకున్నాయి. విమానంలోని పైకప్పు లగేజ్ కంపార్ట్‌‌‌‌మెంట్ నుంచి పొగలు రావడం గమనించిన తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

కొందరు ప్రయాణికులు తమ బ్యాగులతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది ఫైర్ ఎక్స్‌‌‌‌టింగ్యుషర్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం పైలట్లు విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్‎లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.