న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పష్టం చేసింది. ‘‘పోరాటం ఇప్పుడే మొదలైంది. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి” అని ప్రకటించింది. తాము ఇకపై నిరసనలు తెలపబోమని ఎక్కడా ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని వెల్లడించింది. ‘‘ఈ బాండ్ అనేది శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండటానికే సంబంధించినది.. శాంతియుతంగా నిరసన తెలపడం మన రాజ్యాంగ హక్కు”అని పేర్కొంది.
నిజానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం విమానంలో ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న వెంటనే సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే, కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం ఉదయం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతుపై మేజిస్ట్రేట్ వారిని విడుదల చేశారు. విడుదలైన వెంటనే దీప్కే నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి బయలుదేరారు. అనంతరం సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తమను విమానం లోపల నుంచే ‘కిడ్నాప్’ చేశారని ఆరోపించారు. నిరసనలు తెలిపేందుకు జంతర్ మంతర్‌ను తెరవాలని డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తల కుటుంబాలను పోలీసులు బెదిరించారని, నిరసనల్లో చేరకుండా తమ పిల్లలను ఆపాలని వారిని కోరారని సీజేపీ లీగల్ టీమ్ హెడ్ రత్నా సింగ్ ఆరోపించారు. నిఘా వర్గాలు తన కదలికలను ట్రాక్ చేశాయని, కార్యకర్తలపై ఆంక్షల వెనుక ఉన్న కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు. ‘‘నేను ఒక పౌరురాలిని. నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. నన్ను అన్యాయంగా ఎలా నిర్బంధంలో ఉంచుతారు?”అని అన్నారు.
మమ్మల్ని చర్చలకు పిలవాల్సింది..
కేంద్ర ప్రభుత్వం పౌరులు, జర్నలిస్టులపై యుద్ధం చేస్తోందని, ఈ ప్రభుత్వ పతనానికి కాలం దగ్గరపడిందని సౌరవ్ దాస్ మండిపడ్డారు. కేంద్రం "ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని" సృష్టించిందని, నిరసన తెలపాలనుకున్న ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించి ఉండాల్సిందన్నారు. కానీ, ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా చట్టవిరుద్ధంగా తమను అదుపులోకి తీసుకున్నారని, తమ ఫోన్లను ఎలాంటి సీజర్ మెమో ఇవ్వకుండానే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
గతంలో అనేకమంది కార్యకర్తల విషయంలో జరిగినట్లుగానే, తమ ఫోన్లను హ్యాక్ చేసి లేదా క్లోన్ చేసి భవిష్యత్తులో సాక్ష్యాలుగా చూపించేందుకు కుట్ర పన్నుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమ ఫోన్లను ఇప్పటికే ట్యాంపర్ చేసి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గత 72 గంటల్లో జరిగిన పరిణామాలు ప్రజలకు 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని రంకా అన్నారు.
ఢిల్లీకి రాకుండా ప్రజలను అడ్డుకునేందుకు రైళ్లను కూడా రద్దు చేశారన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీలో కనీసం రైళ్లను కూడా ఆపలేదన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, అసలైన దేశద్రోహి ఆయనేనని విమర్శించారు. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌లను అదుపులోకి తీసుకున్న సమయంలో ఢిల్లీ పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారని రంకా ఆరోపించారు.
