న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. ఢిల్లీ వ్యాప్తంగా భారీ భద్రత కొనసాగించిన పోలీసులు ఆదివారం 100మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాలకు సంబంధించి ఈ ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ అయ్యాయి. నిరసన సమయంలో ఘర్షణలు, రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకోవడంతో 15 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఆదివారం నిరసనకారులు జంతర్ మంతర్ వైపు మార్చ్ చేస్తూ ‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇస్తీఫా దో’ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో సీపీఎం ఎంపీ బ్రిట్టాస్ కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడైన జాన్ బ్రిట్టాస్‌పై ఢిల్లీ పోలీసులు క్రూరంగా దాడి చేశారని సీపీఎం ఆరోపించింది. రాజీవ్ చౌక్ నుంచి జంతర్ మంతర్ వైపు మార్చ్ చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఐసా, కేవైఎస్ సభ్యులతో పాటు సీజేపీ మద్దతుదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
