- సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే
- మాది వెనకడుగు వేసే పార్టీ కాదు
- పోలీసులు నన్ను ఫోన్ మాట్లాడనివ్వలే
- లాయర్‌తో మాట్లాడేందుకూ అనుమతించలేదన్న దీప్కే
- దీప్కే ఆరోపణలను ఖండిస్తూ వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: మళ్లీ నిరసనలు తెలపబోమని హామీ ఇస్తూ తాము ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తాము మళ్లీ రోడ్డెక్కి ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. పోలీసు కస్టడీ నుంచి 24 గంటల తర్వాత విడుదలైన దీప్కే ఆదివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి వెళ్తున్నట్లు తెలిపారు.
‘‘శనివారం మా నానమ్మ మృతి చెందారు. ఈ విషాద సమయంలో మా కుటుంబానికి అండగా ఉండేందుకు ఊరికి వెళ్తున్నాను. సీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదు, ఎవరికీ భయపడదు. అక్టోబర్ 10 ఈ నియంతృత్వ పాలనకు ముగింపు పలికే రోజుకు నాందిగా చరిత్రలో నిలిచిపోతుంది’’ అని దీప్కే రాసుకొచ్చారు. తనను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఫోన్ వాడకుండా అడ్డుకున్నారని, లాయర్‌తో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఆయన ఆరోపించారు.
అర్థరాత్రి 3:30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి, తాను చాలా కాలం పాటు జైలులో ఉండాల్సి వస్తుందని చెప్పాలని పోలీసులు ఎందుకు కోరారని ఆయన ప్రశ్నించారు. నానమ్మ వద్దే ఉంటున్న తన కజిన్ నంబర్ తీసుకునేందుకు ఫోన్ ఇవ్వాలని కోరినా పోలీసులు నిరాకరించారని ఆరోపించారు. ఇప్పటికే దుఃఖంలో ఉన్న తన కుటుంబాన్ని పోలీసులు మరింత మానసిక క్షోభకు గురిచేశారని ఆయన మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసుల వీడియో విడుదల
అభిజీత్ దీప్కే కుటుంబ సభ్యులకు తాము సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు చూపుతున్న ఓ వీడియోను ఢిల్లీ పోలీసులు ఆదివారం విడుదల చేశారు. దీప్కే నానమ్మ మరణించిన విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఆయనకు రవాణా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైనట్లు ఆ వీడియోలో ఉంది. దీప్కే స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు, విమానం లేదా రైలు.. ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నారో ఏర్పాట్లు చేస్తామని ఓ పోలీసు అధికారి అడగడం ఆ వీడియోలో వినిపిస్తోందని డీసీపీ పీఆర్ఓ నేహా యాదవ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో తన తండ్రితో మాట్లాడలేనని అభిజీత్ దీప్కే సమాధానం ఇచ్చినట్లు అందులో ఉంది.
