కోల్‌కతా: వచ్చే ఏడాది జనవరిలో జరిగే పుస్తక ప్రదర్శనతో పాటు దుర్గా పూజ వేడుకల్లో పాల్గొనేందుకు కోల్‌కతాకు తిరిగి వస్తానని ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ వెల్లడించారు. దుర్గా పూజను కళాత్మక సృజనల వేడుకగా అభివర్ణించారు. ప్రస్తుతం కోల్‌కతా పర్యటనలో ఉన్న ఆమె శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో మహాలయ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఏడాది కోల్‌కతాలోనే ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
నగరమంతా దుర్గా పూజ పందిళ్ల ఏర్పాటును చూశానని, ఇక్కడి వేడుకలు తనకు చాలా నచ్చాయని చెప్పారు. వచ్చే జనవరి చివర్లో జరిగే పుస్తక ప్రదర్శన టైంలో కోల్‌కతాకు రావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు భద్రత అవసరంలేదని, బెంగాల్ ప్రజలే భద్రత కల్పిస్తారని తెలిపారు. 2007లో నిరసనల కారణంగా కోల్‌కతాను విడిచి వెళ్లిన తస్లీమా.. దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ నగరంలో పర్యటిస్తున్నారు.
