సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నానా పటేకర్ ఆన్-స్క్రీన్ మదర్ మధు కాంబికర్ కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నానా పటేకర్ ఆన్-స్క్రీన్ మదర్ మధు కాంబికర్ కన్నుమూత!

బాలీవుడ్ ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణవార్తతో అభిమానులు విషాదంలో ఉండగానే.. మరో చేదువార్త వచ్చింది. ప్రముఖ మరాఠీ నటి మధు కాంబికర్ (Madhu Kambikar) కన్నుమూశారు. సోమవారం, అక్టోబర్ 12న పుణెలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు. ఆమె మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నానా పటేకర్‌కు తల్లి పాత్రలో..

మధు కాంబికర్ మరణవార్తను మహారాష్ట్ర ప్రభుత్వ సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారికంగా వెల్లడించింది. ఆమె మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా కళారంగంలో కొనసాగిన ఆమె.. సినిమాలు, రంగస్థలం, టెలివిజన్‌తో పాటు జానపద కళలకు విశేష సేవలందించారని కొనియాడారు.

వయసులో నానా పటేకర్ కంటే రెండేళ్లు చిన్నవారైన మధు కాంబికర్, పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించారు. 'హమ్ దోనో' (1995), 'యశ్వంత్'(1997) వంటి హిందీ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. నానా పటేకర్ మరణించిన కొద్ది రోజులకే ఆమె కన్నుమూయడం అభిమానులను మరింత కలచివేస్తోంది.

లావణి కళకు విశేష గుర్తింపు..

మరాఠీ చిత్రసీమలో మధు కాంబికర్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 'శాపిత్' (1982),'ఏక్ హోతా విదూషక్' (1992), 'జపాట్లేల' (1993) వంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మరాఠీ జానపద నృత్యరూపమైన లావణిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 'శాపిత్' చిత్రానికి గాను మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డులను అందుకున్నారు.

►ALSO READ | మమితా బైజు పెళ్లిపై నిర్ణయం అన్నయ్యదేనా? ఒక్క స్టిక్కర్‌తో హీరోయిన్ ఫన్నీ రియాక్షన్!

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, పక్షవాతం (Paralytic Stroke) బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో పూణేలో తుదిశ్వాస విడిచారు.  ఆమె మృతితో మరాఠీ కళారంగం ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మధు కాంబికర్ జ్ఞాపకాలు కళాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.