హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజ్మేరా బేగం అనే మహిళ తన భర్త చేతిలో హత్యకు గురైంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్‌కు చెందిన 32 ఏళ్ల గృహిణి అజ్మేరా బేగం, తన నివాసంలోనే భర్త చేతిలో హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. హత్యకు ముందు భార్యాభర్తల మధ్య పిల్లల సమక్షంలోనే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భర్త పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు.
హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు 'క్లూస్ టీమ్'తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు BNS చట్టం కింద కేసు నమోదు చేశారు.
