ఈసీ ఫైల్స్ అన్నీ బయటపెట్టాలి: సుప్రీంకోర్టులో ఇండియా కూటమి పిటీషన్లలోని ముఖ్యాంశాలు

ఈసీ ఫైల్స్ అన్నీ బయటపెట్టాలి: సుప్రీంకోర్టులో ఇండియా కూటమి పిటీషన్లలోని ముఖ్యాంశాలు

ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌  లపై ఇండియా కూటమి నేతలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2026 అక్టోబర్ 12న మార్చ్ ఫర్ డెమొక్రసీ నిర్వహించిన కూటమి నేతలు.. రాహుల్ గాంధీ సహా 11 మంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను సుప్రీం కోర్టు స్వీకరించింది.  ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లను రెస్పాండెంట్లుగా చేర్చారు.

రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సౌగత్ రాయ్ (టీఎంసీ), అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), తేజస్వి ప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), సంజయ్ రౌత్ (శివసేన యూబీటీ), ఎంఏ బేబీ (సీపీఎం), డీ రాజా (సీపీఐ), మహువా మాఝీ (జేఎంఎం), సుప్రియా సూలే (ఎన్‌సీపీ శరద్ పవార్), ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్) మొదలైన 11 మంది నేతలు పిటిన్లు దాఖలు చేశారు.

పిటిషన్లలో ఏముంది..?

సర్ ప్రక్రియకు  సంబంధించిన అన్ని ఫైళ్లు, ఎజెండాలు, నిమిషాలు, నోటింగ్స్, అభ్యంతరాలు బయటపెట్టాలని కోరారు. జాతీయ స్థాయిలో SIR ప్రారంభించాలని ఎన్నికల సంఘం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రికార్డులు లేవని RTI సమాధానాల ఆధారంగా పేర్కొన్నారు. ఫారం-6ను నిబంధనలు సవరించకుండానే మార్చారని, ఇది మొదటి సారి ఓటు వేసేవారిపై అనవసర భారం వేస్తుందని విమర్శించారు.

2025 జూన్ 24 న సర్ ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతోపాటు ఈసీనెట్, ఈఆర్‌ఓనెట్ యాక్సెస్ లాగ్‌లను వెల్లడించాలని కోరారు. ECINET, ERONET డేటాబేస్‌లు పారదర్శకంగా పనిచేయడం లేదని, ఓటరు పేర్లు తొలగించిన తర్వాత తిరిగి చేర్చే సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 13 కోట్ల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ దశలో తొలగింపుకు గురయ్యాయని  పేర్కొంటూ, అర్హులైన ఓటర్లు బయట పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

►ALSO READ | ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎన్నికల సంఘం సమష్టి అధికారాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒంటరిగా వినియోగించుకున్నారని ఆరోపణ. ఇతర ఎన్నికల కమిషనర్ల అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 324, 2023 చట్టం, టీఎన్ శేషన్ కేసు తీర్పు ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారా అని పరిశీలించాలని కోరారు. ఎలాంటి నోటీసు లేకుండా, వాదన వినిపించుకునే అవకాశం లేకుండా ఏ ఓటరును తొలగించకూడదని డిమాండ్ చేశారు.  

తొలగించిన ఓటర్ల జాబితాను బూత్‌ వారీగా, కారణాలు, డెమోగ్రాఫిక్ వివరాలతో ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర ఆడిట్ కమిటీ ఏర్పాటు చేసి ఓటరు జాబితా మార్పులను పరిశీలించాలని కోరారు. కోర్టు తీర్పు వచ్చే వరకు సర్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.