హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కలిపి మొత్తం 77 మంది ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఇందులో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి 43 మంది, నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి 34 మందికి బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ నేతల బాధ్యతలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
గెలుపు బాధ్యత ఇన్‌చార్జ్‌లదే
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించే బాధ్యతను ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలకే ఎన్నికల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు లేని ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అనుముల తిరుపతిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో కీలకంగా మారనున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఓటర్ల నమోదు ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టడంతో పాటు, నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు, ప్రచార సమన్వయంపై పార్టీ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా బాధ్యతలను స్పష్టంగా విభజించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రెండు స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల్లో మొదటి స్థానానికే ప్రాధాన్యం ఉంటుందని, రెండో స్థానానికి అదే స్థాయి గుర్తింపు ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి నేతలకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలు తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించడంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
