ఢిల్లీ మెట్రోలో సీటు కోసం జరిగిన చిన్న గొడవ ఒక ప్రాణాన్ని బలిగొంది. సీనియర్ సిటిజన్ల కోసం కేటాయించిన సీట్ల విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయడంతో 48 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అక్టోబర్ 8న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు 65 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన 36 ఏళ్ల కుమారుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మృతుడు పవన్ శర్మ తన 65 ఏళ్ల తల్లి దుర్గాదేవితో కలిసి యమునా విహార్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని తన సోదరుడిని కలిసి తిరిగి వస్తున్న సమయంలో మండి హౌస్ మెట్రో స్టేషన్‌లో నిందితులు సంజయ్ ప్రతాప్ సింగ్, సిద్ధార్థ్ సింగ్ ఎక్కారు. సీనియర్ సిటిజన్ల సీట్లలో కూర్చున్న పవన్ శర్మతో వారు వాగ్వాదానికి దిగారు. సీటు వెంటనే ఖాళీ చేయాలని నిందితులు దురుసుగా వ్యవహరించడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ సమీపానికి రాగానే ఆ ఐఏఎస్ ఫ్యామిలీ తమను తీవ్రంగా హెచ్చరిస్తూ సీట్లు ఖాళీ చేయమన్నారని పవన్ శర్మ తల్లి దుర్గాదేవి వెల్లడించారు. తాము లేచి నిలబడగా, పవన్ శర్మ నిందితులను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పవన్ కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టగా.. ఆయన కుమారుడు కూడా దాడికి పాల్పడినట్లు దుర్గాదేవి వెల్లడించారు. వృద్ధ తల్లి అడ్డుపడబోతే ఆమె చేతిని పట్టుకుని అడ్డుకున్నారు నిందితులు.
దీంతో రైలు సుప్రీంకోర్టు స్టేషన్‌కు చేరేసరికి పవన్ శర్మ స్పృహ కోల్పోయి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయనను ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 105, 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెట్రోలో జరిగిన ఈ అమానుష ఘటన ప్రయాణికులను ఒక్క సారిగా షాక్ కి గురిచేసింది. కొన్ని నిమిషాల మెట్రో ప్రయాణంలో సీటు గొడవ చివరికి ఒక మనిషి ప్రాణాలను తీసేసింది. ఎంత ఐఏఎస్ అధికారి అయితే మరీ ఇంత అహంకారంగా వ్యవహరించాలా ఇతరుల పట్ల అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
