నషాముక్త్ భారత్పై రెడ్ క్రాస్ సొసైటీ ఫోకస్.. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో అవగాహన ర్యాలీలు: దానకిశోర్

నషాముక్త్ భారత్పై  రెడ్ క్రాస్ సొసైటీ ఫోకస్.. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో అవగాహన ర్యాలీలు: దానకిశోర్

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై యువతకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఇండియన్ రెడ్‌‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్, స్పెషల్ సీఎస్ దానకిశోర్ పిలుపునిచ్చారు.  సోమవారం రాజ్ భవన్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల రెడ్‌‌క్రాస్ కార్యవర్గ సభ్యులతో సీఈవో ప్రొఫెసర్ శ్రీరాములుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్', 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాల అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. దసరా తర్వాత అన్ని జిల్లాల్లో అవగాహన ర్యాలీలు, విద్యాసంస్థల్లో సదస్సులు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

 ఈ కార్యక్రమాల్లో  జూనియర్, యూత్ రెడ్‌‌క్రాస్ వాలంటీర్లతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని దానకిశోర్ సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలతో డ్రగ్స్​పై యువతకు అవగాహన కల్పించాలన్నారు.