ముంబై : భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వారాంతంలో చేపట్టిన సంస్కరణలతో సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పుంజుకుంది. అమెరికన్ డాలరుతో పోలిస్తే ఏకంగా 93 పైసలు బలపడి 95.78 వద్ద స్థిరపడింది. గత ఆరు నెలల కాలంలో రూపాయికి ఇదే అత్యుత్తమ సింగిల్-డే రికవరీ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఒకే రోజు 166 పైసల భారీ లాభాన్ని నమోదు చేసింది.
రూల్స్ కఠినతరం
కరెన్సీ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అడ్డుకునేందుకు శనివారం డెరివేటివ్ నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసింది. సాధారణంగా కొందరు ట్రేడర్లు లేదా సంస్థలకు విదేశాలతో ఎటువంటి అసలు వ్యాపారాలు ఉండవు. కానీ "రాబోయే రోజుల్లో రూపాయి ఇంకా పడిపోతుంది, డాలర్ బాగా పెరుగుతుంది" అని అంచనా వేసి, లాభాల కోసం డెరివేటివ్స్ మార్కెట్లో భారీగా డాలర్లను కొంటూ పందెం కాస్తారు. అందరూ కలిసి ఇలా డాలర్లను కొంటూ పోతుంటే, మార్కెట్లో డాలర్లకు సడెన్‌గా డిమాండ్ ఏర్పడి, రూపాయి విలువ మరింత వేగంగా పతనమవుతుంది. సరైన వ్యాపార కారణం లేకుండా, కేవలం లాభాల కోసం రూపాయి పడిపోతుందని పందాలు కాసే కాంట్రాక్టులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించి వాటిని నిలిపివేసింది. ఒక క్లయింట్ లేదా సంస్థ బ్యాంక్ వద్దకు వెళ్లి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.19 కోట్లు) అంతకంటే ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో డాలర్లు కొనాలని అడిగినప్పుడు , బ్యాంకులు ఆ లావాదేవీ విలువలో 20 శాతం మొత్తాన్ని ప్రత్యేక రిజర్వుగా (డిపాజిట్‌గా) పక్కన పెట్టాలి. దీంతో బ్యాంకుల ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చును డాలర్లు కొనే క్లయింట్లపైనే రుద్దుతాయి. డాలర్లు కొనడం భారంగా మారడంతో కంపెనీలు/ట్రేడర్లు అవసరం లేకపోయినా ముందే భారీగా డాలర్లను పోగేసుకోవడం ఆపేస్తాయి. రద్దయిన ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను రీబుక్ చేయకుండా కూడా ఆంక్షలు విధించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండోను తీసుకొచ్చింది. అంటే కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచుల్లోనే డాలర్లు తీసుకొని ఆయిల్ కొనుగోలు చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. స్పాట్ మార్కెట్లో డాలర్ల డిమాండ్ తగ్గింది.
మార్కెట్ మళ్లీ డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టపోయాయి. వడ్డీ రేట్ల పెంపు భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ఎఫ్‌ఐఐల అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో సెన్సెక్స్ 547.65 పాయింట్లు పతనమై 71,924.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157.10 పాయింట్లు తగ్గి 22,363.35 వద్ద ముగిసింది.
