కొత్త GST రూల్స్ ర్యాపిడో, ఉబెర్ డ్రైవర్ల ఆదాయాన్ని తగ్గిచ్చేస్తాయా.. అసలు ఏం జరుగుతోంది?

కొత్త GST రూల్స్ ర్యాపిడో, ఉబెర్ డ్రైవర్ల ఆదాయాన్ని తగ్గిచ్చేస్తాయా.. అసలు ఏం జరుగుతోంది?

దేశంలోని ప్రముఖ రైడ్-హెయిలింగ్ దిగ్గజాలైన ఓలా, ఉబెర్, ర్యాపిడో, నమ్మ యాత్రి లాంటి సంస్థలకు జీఎస్టీ కౌన్సిల్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి. క్యాబ్, ఆటో బుకింగ్, బైక్ ట్యాక్సీ సేవల రంగంలో ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై జీఎస్టీ స్పష్టత ఇవ్వాలన్న ప్రతిపాదన ఈ కంపెనీలతో పాటు డ్రైవర్ల భవితవ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ సరికొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే యాప్ కంపెనీల వ్యాపార నమూనాతో పాటు ప్రయాణికులపై పడే భారం ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం ఈ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అనుసరిస్తున్న సబ్‌స్క్రిప్షన్, రీఛార్జ్ మోడల్ కింద.. డ్రైవర్లు కంపెనీకి రోజువారీగా ఒక ఫిక్స్‌డ్ ఫీజు చెల్లించి, ఆయా రైడ్ల ద్వారా వచ్చిన మొత్తం సంపాదనను తీసుకుంటున్నారు. ప్లాట్‌ఫారమ్‌లు కేవలం టెక్నాలజీ సేవలను మాత్రమే అందిస్తున్నందున.. ఇప్పటివరకు ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై 18 శాతం జీఎస్టీని చెల్లిస్తూ వచ్చాయి. అయితే సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కింద తీసుకొస్తున్న కొత్త సవరణ ద్వారా.. ఏ రకమైన కమర్షియల్ మోడల్ ఉన్నప్పటికీ, మొత్తం రైడ్ ఫేర్ అంటే ప్రయాణికుడు చెల్లించే సొమ్ముపై 5 శాతం జీఎస్టీని నేరుగా ప్లాట్‌ఫారమ్‌లే చెల్లించాల్సి ఉంటుంది.

మోడీ సర్కార్ తెస్తున్న కొత్త జీఎస్టీ రూల్ వల్ల కంపెనీల రాబడికి, పన్ను చెల్లింపులకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉదాహరణకు.. ఒక రోజులో రూ.10వేలు విలువైన రైడ్లు జరిగితే, డ్రైవర్ నుంచి కేవలం రూ.100 సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే ప్లాట్‌ఫారమ్.. ప్రయాణ ఛార్జీలపై దాదాపు రూ.500 వరకు జీఎస్టీ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి వాస్తవంగా వచ్చే ఆదాయం కంటే 5 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా ఈ పన్నును ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా సర్దుబాటు చేయడానికి వీలులేకుండా నేరుగా క్యాష్ పేమెంట్ రూపంలోనే చెల్లించాల్సి రావడంతో రెయిడ్ కంపెనీలపై ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

►ALSO READ | సోమవారం కుప్పకూలిన సూచీలు.. మార్కెట్ రికవరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని మొదట మార్కెట్‌లోకి తెచ్చిన నమ్మ యాత్రి బాటలోనే 2023లో ర్యాపిడో, 2024-25 నాటికి ఉబెర్, ఓలా కూడా ఆటోలు, క్యాబ్‌లకు ఈ మోడల్‌ను విస్తరించాయి. అయితే తాజా పన్ను నిబంధనల కారణంగా కంపెనీలు ఈ మోడల్‌ను కొనసాగించాలా వద్దా అని పునరాలోచనలో పడ్డాయి. అదనపు పన్ను భారంతో ప్రయాణికులపై ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. లేదా డ్రైవర్ల సంపాదనను తగ్గించాల్సి రావచ్చు. డ్రైవర్ల సరఫరా చాలా సున్నితమైన అంశం కాబట్టి వారి ఆదాయానికి కోత పెట్టకుండా.. పాత పద్ధతిలో మళ్లీ కమిషన్ బేస్డ్ మోడల్‌కు మారాలా వద్దా అనే డైలమాలో యాప్ కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి.