కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.52.50 కోట్లు మంజూరు చేసినట్లు మంగళవారం ఆర్అండ్బీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవతో నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పాత జాతీయ రహదారి- 9 నుంచి కొండాపురం వరకు 12.2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.27 కోట్లు, బేతవోలు నుంచి ఆచార్యులగూడెం వరకు 5.6 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి.
పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపురం రోడ్డు వరకు 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు రూ.4.50 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామలక్ష్మీపురం వరకు 3.1 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
