జైలు నుంచి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ క్రికెటర్!

జైలు నుంచి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ క్రికెటర్!

Abhishek Porel: రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న గ్రూప్-సి మ్యాచ్‌లో బెంగాల్ వికెట్‌కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ (Abhishek Porel) అజేయ శతకంతో మెరిశాడు. ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న అతడు.. మైదానంలో మాత్రం సెంచరీ సాధించి భావోద్వేగానికి గురయ్యాడు. శతకం పూర్తి చేసుకున్న వెంటనే స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్న పోరెల్.. ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడి తనపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు.

నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను: అభిషేక్ 

సెంచరీ సాధించిన అనంతరం అభిషేక్ పోరెల్ మాట్లాడుతూ.. నేను ఏడవాలని అనుకోలేదు, కానీ కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయి.. నా సెలబ్రేషన్‌ ద్వారా నేను ఎవరికీ ఏమీ చెప్పాలనుకోవడం లేదనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను.. నాకు క్రికెట్ ఆడటం మాత్రమే ముఖ్యం.. నా ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. నేను దారుణమైన పరిస్థితుల్లో ఎలా నిలబడాలో చూశాను.. ఆ అనుభవం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.. అవి నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి.. నేను నా మాటలతో సమాధానం ఇవ్వను.. నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తానని స్పష్టం చేశాడు.

పోరెల్ సెంచరీ.. బెంగాల్ భారీ ఆధిక్యం: 

ఈ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ జట్టును 240 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగాల్.. సోమవారం ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఇక సుదీప్ ఘరామి (221 బంతుల్లో 122 పరుగులు), అభిషేక్ పోరెల్ (161 బంతుల్లో 114 పరుగులు) శతాలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ కలిసి  199 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును భారీ ఆధిక్యంలో నిలిపారు.

►ALSO READ | ఉప్పల్‌లో పరుగుల సునామీ పక్కా.. ఆ ఇద్దరిపైనే భారీ అంచనాలు, టీమిండియా 300 కొట్టేనా?

అభిషేక్ పోరెల్‌పై ఉన్న ఆరోపణలు ఇవే!

ఈ ఏడాది జూన్‌లో కర్ణాటకకు చెందిన ఓ యువ వైద్య విద్యార్థిని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. తాము సుమారు మూడున్నరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్లు ఆరోపించింది. అయితే ఆ తర్వాత పోరెల్ తమ మధ్య ఉన్న సంబంధాన్ని అంగీకరించలేదని, దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. జూన్‌లో ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువతి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. కేసును విచారించిన కోర్టు జూలై 20న పోరెల్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. అత్యాచార ఆరోపణలతో పాటు బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన అంశాలు కోర్టు విచారణలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం అభిషేక్ పోరెల్ బెయిల్‌పై బయట ఉన్నారు.