తిరువనంతపురం: డబ్బు ఉంటే ప్రాణాలు తీసిన పర్వాలేదా..? పలుకుబడి ఉంటే తప్పు చేసిన శిక్ష పడదా..? చట్టం బలిసినోళ్లకు ఒకలా.. బక్కోడిలా వర్తిస్తుందా..? అంటే కేరళలో ఇటీవల జరిగిన ఓ ఘటన తర్వాత సమాధానం ఔను అనే వినిపిస్తుంది. అక్టోబర్ 10న కేరళలోని కొచ్చి విమానాశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ మినీ కూపర్ కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురు మరణించారు.
కారు నడిపిన యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారు ఎందుకు అంత వేగంగా నడిపావని స్థానికులు ప్రశ్నించగా.. ‘‘ఏం జరిగినా మా నాన్న చూసుకుంటాడు’’ అంటూ అహంకారపూరిత సమాధానం ఇచ్చాడని స్థానికులు తెలిపారు. నిందితుడిని 19 ఏళ్ల సుహైల్ సజీవ్గా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో మొత్తం నలుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు సుహైల్ సజీవ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉండగా.. ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు, చిరునామా స్థానంలో సుహైల్ పేరు రాయకుండా గుర్తుతెలియని వ్యక్తి అని నమోదు చేశారు పోలీసులు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుహైల్ తండ్రి సజీవ్ జమాల్ కేరళలో ఒక ప్రముఖ టెక్స్‌టైల్ వ్యాపారి.
డబ్బు, పలుకుబడి ఉందనే కారణంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్లో సుహైల్ పేరు రాయలేదని పలువురు విమర్శిస్తున్నారు. డబ్బు, పలుకుబడి ఉంటే ప్రాణాలు తీసినా పర్వాలేదా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనబలం, హోదా ఉందనే అహంకారంతో ముగ్గురి ప్రాణాలు తీసిన యువకుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. కేసును తప్పుదోవ పట్టించకుండా నిందితులను శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
