- రికార్డుస్థాయిలో రూ.89.26 లక్షల అమ్మకాలు
హైదరాబాద్, వెలుగు: నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సరస్ మేళాకు జనం భారీగా తరలొస్తున్నారు. ఆరో రోజైన సోమవారం రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఒక్కరోజే సుమారు రూ.90 లక్షల విక్రయాలు జరిగాయి. ఉదయం నుంచే నగర పౌరులు, విదేశీయులు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేళా ప్రాంగణం కిటకిటలాడింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 54,556 మంది మేళాను సందర్శించారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సైతం స్టాళ్లను సందర్శించి మహిళా సంఘాల ఉత్పత్తులను పరిశీలించి, వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. మణిపూర్‌కు చెందిన మహిళా సంఘం ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. వెదురుతో రూపొందించిన ఇంటి అలంకరణ వస్తువులు, నిత్యావసర ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ లభించింది. ఒక్క సోమవారమే రూ.లక్ష విలువైన వెదురు ఉత్పత్తులు అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు.
మేళాలో నారాయణపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సీతాఫలాల స్టాల్ వద్ద సందర్శకులు బారులు తీరారు. తోటల నుంచి నేరుగా తెచ్చిన తాజా సీతాఫలాలను కిలో కేవలం రూ.100కే అందించడంతో కొనుగోలుకు జనం ఎగబడ్డారు. కాగా, చేనేత కళా వైభవానికి, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్న ఇందిరా మహిళా శక్తి చీర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రత్యేక డిజైన్ చీరను మహిళలు ఆసక్తిగా తిలకించారు.
