వెలుగు స్పెషల్ : ఒక కిలోవాట్ సోలార్  అమర్చుకుంటే 51 చెట్లు నాటినట్లే

వెలుగు స్పెషల్ :  ఒక కిలోవాట్ సోలార్  అమర్చుకుంటే 51 చెట్లు నాటినట్లే

ప్రపంచవ్యాప్తంగా  వాతావరణ మార్పులు,  గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అత్యంత కీలకంగా మారింది.  ముఖ్యంగా సూర్యరశ్మి సమృద్ధిగా లభించే  భారతదేశంలో  సోలార్ విద్యుత్ భవిష్యత్తు ఇంధన అవసరాలకు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక గొప్ప పరిష్కారం.  బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని కొంతమేర తగ్గించి, ప్రతి ఇంటి పైకప్పును చిన్న విద్యుత్ కేంద్రంగా మార్చడం ద్వారా భారీస్థాయిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు.  సాధారణంగా తెలంగాణలో 1 కిలోవాట్ రూఫ్‌‌‌‌టాప్  సోలార్ వ్యవస్థ సంవత్సరానికి సుమారు 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదని అంచనా.  గ్రిడ్ విద్యుత్‌‌‌‌కు సుమారు 0.75 కిలోగ్రాము కార్బన్ డయాక్సైడ్/యూనిట్ అనే లెక్కను తీసుకుంటే,  ఒక కిలోవాట్ సోలార్ ద్వారా సంవత్సరానికి సుమారు 1,125 కిలోగ్రాములు లేదా 1.125 టన్నుల కార్బన్ ఉద్గారాలను  నివారించవచ్చు. ఒక చెట్టు సంవత్సరానికి సగటున 22 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుందని పరిగణిస్తే, 1 కిలోవాట్ సోలార్ విద్యుత్ సుమారు 51 చెట్లు ఒక సంవత్సరంపాటు గ్రహించే కార్బన్‌‌‌‌కు సమానం.

 

భారత అటవీ సర్వే సంస్థ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023 ప్రకారం తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 21,179.04 చదరపు కిలోమీటర్లు. అంటే రాష్ట్ర  భౌగోళిక విస్తీర్ణంలో 18.89 శాతం ఉంది. ఇందులో  దట్టమైన అడవి 1,613.32, మధ్యస్థ సాంద్రత అడవి 8,909.90, చెల్లాచెదురుగా ఉన్న అడవి 10,655.82 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి.   

తెలంగాణలో ఈ ఏడాది 10 లక్షల ఇళ్లపై సగటున 

3 కిలోవాట్ల  రూఫ్‌‌‌‌టాప్  సోలార్  ఏర్పాటు చేస్తే మొత్తం స్థాపిత సామర్థ్యం 3వేల మెగావాట్లు అవుతుంది.  ఒక్కో కిలోవాట్ సంవత్సరానికి 1,500 యూనిట్లు ఉత్పత్తి చేస్తే, ఈ 3 వేల మెగావాట్ల రూఫ్‌‌‌‌టాప్ వ్యవస్థల ద్వారా ఏడాదికి సుమారు 450 కోట్ల యూనిట్లు, అంటే 4.5 బిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.  అదేవిధంగా 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఒక ఇంటికి సుమారు 153 చెట్ల సమానమైన వార్షిక కార్బన్ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక10 లక్షల ఇళ్ల లెక్కను తీసుకుంటే 15.3 కోట్ల చెట్లకు సమానం.  పది లక్షల ఇళ్లపై రూఫ్‌‌‌‌టాప్ సోలార్ ఏర్పాటు చేయడం ద్వారా 15.3 కోట్ల చెట్లు ఒక సంవత్సరంపాటు అందించే కార్బన్ శోషణకు సమానమైన ప్రభావం సాధించవచ్చు.  అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ 15.3 కోట్ల చెట్లను నిజంగా అడవిగా మార్చినట్లు చెప్పలేం. ఇది కార్బన్ శోషణకు సమానమైన అంచనా మాత్రమే. ఉదాహరణకు హెక్టారుకు 400 చెట్ల సాంద్రతను ఊహిస్తే 15.3 కోట్ల చెట్లకు సుమారు 38,250 హెక్టార్లు లేదా 382.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం అవుతుంది. ఇది కేవలం పోలిక కోసం మాత్రమే చూడాలి. తెలంగాణ వాస్తవ అటవీ విస్తీర్ణం అంత మేర పెరిగిందని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు.

బొగ్గు వినియోగంపై ప్రభావం

భారతదేశంలోని దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో 2024–25లో నమోదైన స్పెసిఫిక్ కోల్ కన్సంప్షన్ సుమారు 0.692 కేజీ/కేడబ్ల్యూ
హెచ్‌‌‌‌గా సీఈఏ వార్షిక  నివేదికలో పేర్కొంది. 4.5 బిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ బొగ్గు ఆధారిత ఉత్పత్తిని ప్రత్యామ్నాయంగా చేస్తే, 0.692కిలోల చొప్పున సుమారు 3.114 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది.  అంటే  సంవత్సరానికి సుమారు 31.1 లక్షల టన్నులు లేదా 3.1 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగాన్ని సమాన స్థాయిలో నివారించే అవకాశం ఉంటుంది.  వాస్తవ ఆదా గ్రిడ్‌‌‌‌లో  ఏ సమయంలో,  ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

డిస్కంలకు ప్రయోజనాలు

ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ పెరగడం వల్ల డిస్కంలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. పగటి సమయంలో గృహాల వినియోగంలో కొంత భాగాన్ని స్థానికంగా సోలార్ ద్వారా తీర్చడం వల్ల గ్రిడ్ నుంచి తీసుకునే విద్యుత్ డిమాండ్  తగ్గుతుంది.  పంపిణీ నష్టాలు,  ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు,  ఫీడర్లపై లోడ్,  విద్యుత్ కొనుగోలు అవసరం కొంతమేర  తగ్గే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా పగటి సమయంలో సోలార్ ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల వ్యవసాయ,  ఇతర పగటి విద్యుత్ అవసరాలను నిర్వహించడంలో సహకరిస్తుంది.  అదనంగా,  వియోగదారుల ఇళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి కావడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారుడి వరకు విద్యుత్ రవాణా చేయాల్సిన దూరం తగ్గుతుంది.  దీర్ఘకాలంలో పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడంలో కూడా రూఫ్‌‌‌‌టాప్  సోలార్  కీలక పాత్ర  పోషించగలదు. 

వినియోగదారులకు లాభాలు

రూఫ్‌‌‌‌టాప్ సోలార్ వినియోగదారుడిని కేవలం విద్యుత్ వినియోగదారుడిగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారుడిగా కూడా మారుస్తుంది.  నెలవారీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం వంటి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ సబ్సిడీ,  నెట్ మీటరింగ్ వంటి విధానాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాలు మరింత పెరగవచ్చు. అందువల్ల 10 లక్షల ఇళ్లపై 3 కిలోవాట్ల చొప్పున రూఫ్‌‌‌‌టాప్ సోలార్ ఏర్పాటు చేయడం కేవలం 3 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సృష్టించే  కార్యక్రమం మాత్రమే కాదు. ఇది సంవత్సరానికి సుమారు 4.5 బిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన విద్యుత్,  సుమారు 3.1 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగానికి  సమానమైన తగ్గింపు,  సుమారు 3.375 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ, 15.3 కోట్ల చెట్ల వార్షిక కార్బన్ శోషణకు సమానమైన పర్యావరణ ప్రయోజనం అందించే  కార్యక్రమంగా నిలుస్తుంది.   ‘ప్రతి ఇంటి పైకప్పుపై  ఒక సోలార్ ప్యానెల్,  ప్రతి కుటుంబానికి విద్యుత్ ఆదా,  రాష్ట్రానికి  ఇంధన భద్రత,  భవిష్యత్ తరాలకు 
స్వచ్ఛమైన పర్యావరణం’  అనే లక్ష్యంతో  రూఫ్‌‌‌‌టాప్  సోలార్‌‌‌‌ను  ప్రజాఉద్యమంగా మార్చాలి.
 

- దురిశెట్టి మనోహర్
రిటైర్డ్ ఏడీఈ