వెలుగు స్పెషల్ : ఆరోగ్యంపై ఎల్‌‌‌‌నినో.. ప్రభావం, జాగ్రత్తలు 

వెలుగు స్పెషల్ : ఆరోగ్యంపై ఎల్‌‌‌‌నినో.. ప్రభావం, జాగ్రత్తలు 

వాతావరణంలో వచ్చే మార్పులు కేవలం ఎండలు, వానలు, వ్యవసాయ దిగుబడులకే పరిమితం కావు. అవి మనిషి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.  తీవ్రమైన వేడి, నీటి కొరత, ఆహార సంక్షోభం, గాలి కాలుష్యం, అంటువ్యాధులు వ్యాప్తి వంటి సమస్యలు ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్న అంశం ఎల్‌‌‌‌నినో. దీనిని కేవలం వాతావరణ సమస్యగా కాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశంగా చూడాలి.   ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలో,  వర్షపాత సరళిలో అనేకమైన మార్పులు రావొచ్చు.  కొన్ని ప్రాంతాల్లో కరువు,  మరికొన్ని  ప్రాంతాల్లో భారీ వర్షాలు,  వరదలు సంభవించే అవకాశాలు ఉంటాయి.  అయితే ప్రతి ఎల్‌‌‌‌నినో  ప్రభావం ఒకే విధంగా ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ,  ప్రముఖ వైద్య పరిశోధనా పత్రిక లాన్సెట్‌‌‌‌లో  వెలువడిన తాజా విశ్లేషణలు  వాతావరణ సంబంధిత  ఆరోగ్య ముప్పులను ముందుగానే గుర్తించి,  ప్రజలను రక్షించేందుకు సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నాయి. ఎల్‌‌‌‌నినో వల్ల ఏర్పడే పరిస్థితులను అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
 

ప్రపంచ చరిత్రలో 1982–1983, 1997–1998,  2015–2016  సంవత్సరాల్లో  సంభవించిన  ఎల్‌‌‌‌నినో ఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి.  2015–2016లో  ఎల్‌‌‌‌నినో  ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది.  కరువు, వరదలు, ఆహార కొరత,  వ్యాధుల ముప్పును  ఎదుర్కొన్నారు. వాతావరణ  పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కూడా పోషకాహార లోపం, పేదరికం, జీవనోపాధి నష్టంవంటి సమస్యలు వెంటనే తొలగిపోవు.  ప్రకృతి విపత్తుల ప్రభావం కొన్ని నెలలకే  పరిమితం కాకుండా  కొంతకాలంపాటు కొనసాగవచ్చని  గత  అనుభవాలు తెలియజేస్తున్నాయి. 

అధిక వేడి ప్రభావం

అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై  తీవ్ర ప్రభావం చూపే  ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒకటి.  శరీరం తన ఉష్ణోగ్రతను  నియంత్రించుకోవడానికి  చెమట ద్వారా వేడిని బయటకు పంపుతుంది. తీవ్రమైన వేడి, అధిక తేమ,  తగినంత నీరు అందకపోవడం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా నీరసం, తల తిరగడం, డీహైడ్రేషన్‌‌‌‌, వడదెబ్బ వంటి సమస్యలు వస్తాయి. 

ప్రపంచవ్యాప్తంగా  2012–2021 మధ్య ఏటా సగటున సుమారు 5.46 లక్షల మరణాలు అధిక ఉష్ణోగ్రత కారణంగా జరిగినవిగా లాన్సెట్‌‌‌‌ కౌంట్‌‌‌‌డౌన్‌‌‌‌  
విశ్లేషణ అంచనా వేసింది. 1990వ దశకంతో  పోలిస్తే వేడి సంబంధిత మరణాల రేటు 23 శాతం పెరిగింది.  ఇవి ఎల్‌‌‌‌నినో వల్ల  మాత్రమే  సంభవించిన మరణాలు కావు.  పెరుగుతున్న ఉష్ణోగ్రత  ప్రజారోగ్యంపై చూపుతున్న విస్తృత ప్రభావాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశం మాత్రం ఉంది. 

ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి?

ఎల్‌‌‌‌నినో  ప్రభావం  ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉండదు. తూర్పు, దక్షిణ ఆసియాలో కరువు, ఆఫ్రికా కొరత ప్రమాదం పెరగవచ్చు.  ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో వర్షపాతం మార్పులు,  వరదలు అంటు వ్యాధుల ముప్పు ఏర్పడవచ్చు.  పెరూ, ఈక్వెడార్‌‌‌‌‌‌‌‌ వంటి దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలు భారీ వర్షాలు,  వరదలను ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఇండోనేసియా,  ఆస్ట్రేలియా,  పాపువా న్యూ గినియా, పసిఫిక్‌‌‌‌ ద్వీప దేశాల్లో కరువు, నీటి కొరత, అడవుల మంటల  ప్రమాదం పెరగవచ్చు.  భారత్‌‌‌‌లో ఎల్‌‌నినో కొన్ని సందర్భాలలో బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది. వర్షాలు తగ్గితే వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి ప్రభావితమవుతాయి. అయితే దేశంలోని  అన్ని ప్రాంతాలు ఒకేవిధంగా ప్రభావితమవుతాయని చెప్పలేం. 

భారత్‌‌‌‌లోనూ ఆందోళనకర పరిస్థితులు

2024లో భారతదేశ ప్రజలు సగటున 19.8 శాతం వడగాల్పులకు గురయ్యారు.  అధిక వేడి కారణంగా ఆరుబయట పనిచేసే ప్రజలు శారీరక శ్రమ సామర్థ్యం తగ్గి సుమారు 247 బిలియన్‌‌‌‌ పని గంటలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రభావానికి ఎక్కువగా గురయ్యారు. ఈ గణాంకాలు కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే సూచించవు. ఎండలో ఎక్కువసేవు పనిచేసేవారికి నీటిలోపం, వడదెబ్బ, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా గుర్తు చేస్తాయి. 

 అవయవాలపై  ప్రభావం

వేడి కారణంగా శరీరంలో నీరు తగ్గి రక్త ప్రసరణపై  ఒత్తిడి పెరుగుతుంది. శరీరాన్ని  చల్లబరచడానికి గుండె ఎక్కువగా పనిచేయవలసి వస్తుంది.  వడదెబ్బ తీవ్రమైతే  మెదడు పనితీరు దెబ్బతిని గందరగోళం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.  దుమ్ము, గాలి కాలుష్యం, అడవుల మంటల పొగతోపాటు అధిక వేడి ప్రభావం ఆస్తమా, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులను తీవ్రతరం చేయవచ్చు.  నిద్రకు ఆటంకం కలిగించి అలసట, మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. గర్భిణుల్లో అధికమైన వేడి వాతావరణం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కలిగి ఉన్నట్టుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

మూత్రపిండాలపై..

మూత్రపిండాల ఆరోగ్యంపై  వేడి ప్రభావం ప్రత్యేకంగా గుర్తించాలి.  అధిక చెమట, తగినంత నీరు తాగకపోవడం, ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గుతుంది.  దీనివల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ తగ్గి  అక్యూట్ కిడ్నీ ఇంజురీ సంభవించవచ్చు. ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి, మధుమేహం లేదా గుండె జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.  అయితే మూత్రపిండాల వ్యాధిగ్రస్తులందరూ ఎక్కువ నీరు తాగాలని చెప్పడం సరికాదు.  డయాలిసిస్ చేయించుకునేవారు,  ద్రవాల పరిమితి పాటించేవారు వైద్యుల సూచనల ప్రకారం నీరు తీసుకోవాలి.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

చిన్న పిల్లలు,  వృద్ధులు, గర్భిణులు,  గుండె జబ్బులు, మధుమేహం,  మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోస సమస్యలున్నవారు  జాగ్రత్తలు తీసుకోవాలి.  రైతులు, నిర్మాణ కార్మికులు, వీధివ్యాపారులు, ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు  ప్రత్యేక జాగ్రత్తలు  తీసుకోవాలి.  తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఎక్కువగా ప్రభావితమవుతారు. వేడి ప్రభావాల రీత్యా పనివేళలు మార్చుకోవడం వంటివి చేయాలి.

వ్యక్తిగత జాగ్రత్తలే తొలి రక్షణ

దాహం వేసేవరకు వేచి ఉండకుండా క్రమం తప్పకుండా నీరు తాగాలి.  ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయట శారీరక శ్రమను తగ్గించాలి.  తప్పనిసరిగా పనిచేయాల్సి వస్తే నీడలో విరామాలు తీసుకోవాలి.  సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి.  ఇంటివద్ద దోమల పెరుగుదలను అరికట్టాలి.  ప్రభుత్వాలు కూడా ముందుగానే సిద్ధం కావాలి.   వాతావరణ హెచ్చరికలను  ప్రజలకు ముందుగానే చేరవేయడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం,  ఆసుపత్రులను సిద్ధం చేయడం తగిన ముందస్తు చర్యలకు ప్రభుత్వ  ప్రాధాన్యాలుగా ఉండాలి.

 ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాల్లో  వడదెబ్బ,  డీహైడ్రేషన్‌‌‌‌, మూత్రపిండాల దెబ్బతినడాన్ని పరీక్షించి చికిత్స అందించే ఏర్పాట్లుచేయాలి.  కార్మికులకు తగిన విశ్రాంతి, తాగునీరు, అవసరమైన పనివేళల మార్పులు కల్పించాలి. ఆరోగ్య వాతావరణ శాఖలు సమన్వయంతో పనిచేయాలి.  నీటి వనరుల సంరక్షణ, చెట్ల పెంపకం, గాలి కాలుష్య నియంత్రణ  కూడా దీర్ఘకాలిక ఆరోగ్యానికి  మేలు చేస్తాయి.  ఎల్‌‌‌‌నినో  పూర్తిగా  నివారించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, దానివల్ల  కలిగే ఆరోగ్య నష్టాలను ముందస్తు  ప్రణాళికతో తగ్గించవచ్చు.  శాస్త్రీయ హెచ్చరికలు, వ్యక్తిగత జాగ్రత్తలు,  సురక్షితమైన నీరు,  సమర్థవంతమైన  ప్రజారోగ్య వ్యవస్థ కలిసి పనిచేసినప్పుడే ప్రమాదాలను ఎదుర్కోగలం.  వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో.  వాటి  ప్రభావాల నుంచి  ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా  అంతే ముఖ్యం. 

డెంగీ, ఇతర అంటువ్యాధుల ముప్పు

వాతావరణంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతం మారడం వల్ల కొన్ని ప్రాంతాల్లో దోమల వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. 2026లో ప్రచురితమైన  బహు దేశాల అధ్యయనం ఎల్‌‌‌‌నినోకు సంబంధించి అదనంగా సంభవించే  డెంగీ కేసులను విశ్లేషించింది.   2000–2019 మధ్య 21 దేశాల్లోని 1,237 ప్రాంతాల సమాచారాన్ని పరిశీలించిన ఈ అధ్యయనం పసిఫిక్‌‌‌‌ సముద్ర తీరప్రాంతంలోని ఎల్‌‌‌‌నినోతో సంబంధం ఉన్న డెంగీ కేసుల భారాన్ని  గుర్తించింది. అయితే ఈ అంచనాలను భారతదేశానికి నేరుగా వర్తింపజేయలేం.  కానీ, అధిక ఉష్ణోగ్రత వల్ల డెంగీ వ్యాధి మనదేశంలో ప్రబలే అవకాశం అధికంగా ఉంది.  డెంగీ వ్యాప్తికి కారణమయ్యే వాతావరణం ఏర్పడటమే దీనికి కారణం. నివారణ చర్యల్లో మొదటిది పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వడమే. 

- డాక్టర్​ శ్రీభూషణ్​రాజు
హెడ్​, నెఫ్రాలజీ డిపార్ట్​మెంట్, నిమ్స్​
(స్టేట్​ జీవన్​దాన్​ ట్రస్ట్​ నోడల్​ ఆఫీసర్​)