- రాబర్ట్ హాల్, మైఖేల్
- వుడ్‌ఫోర్డ్‌లకు పురస్కారం
- రూ.10 కోట్లకు పైగా ప్రైజ్‌మనీ
- డిసెంబర్ 10న అవార్డుల ప్రదానం
స్టాక్‌హోమ్: ఆర్థికశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక ‘నోబెల్ మెమోరియల్ ప్రైజ్’ను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను ఇద్దరికి దీనిని అందించనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్తలు రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ‘మాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ (స్థూల ఆర్థిక స్థిరత్వం) రంగానికి సంబంధించి సూక్ష్మ ఆర్థిక పునాదులు’పై చేసిన విశేష పరిశోధనలకు గాను వీరికి ఈ గౌరవం దక్కింది.
మెడిసిన్‌తో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారంతో ముగిసింది. కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ ఈ. హాల్1967లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. మసాచుసెట్స్‌కు చెందిన మైఖేల్ వుడ్‌ఫోర్డ్ సైతం ఎంఐటీ నుంచి 1983లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నోబెల్ ఎకనామిక్సైన్సెస్ కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రస్తుతం వాడుతున్న ఆర్థిక నమూనాలకు వీరి పరిశోధనలు ఒక బలమైన సైద్ధాంతిక పునాదిని అందించాయి. ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీరి విధానాలు దోహదపడతాయి’ అని కొనియాడారు.
రూ.10 కోట్లకు పైగా ప్రైజ్ మనీ
ఈ పురస్కారం కింద విజేతలకు 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (సుమారు 1.2 మిలియన్ డాలర్లు / భారతీయ కరెన్సీలో రూ.10 కోట్లకు పైగా) క్యాష్ ప్రైజ్ లభిస్తుంది. దీనిని ఇద్దరు పరిశోధకులు పంచుకుంటారు. డిసెంబర్ 10న అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఇతర నోబెల్ పురస్కారాలతో పాటుగా ఈ బహుమతిని కూడా అందజేస్తారు.ఈ ఆర్థిక శాస్త్ర అవార్డును అధికారికంగా ‘బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ అల్ఫ్రెడ్ నోబెల్’ అని పిలుస్తారు. నిలకడగా ఉండే ఆర్థిక వృద్ధి, సంక్షేమంపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు గతేడాది (2025) ఈ పురస్కారాన్ని అందించిన సంగతి తెలిసిందే.
