ఓయూలో స్టూడెంట్స్ భారీ ర్యాలీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్

ఓయూలో స్టూడెంట్స్  భారీ ర్యాలీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌‌ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను అరెస్ట్ చేయాలని ఓయూలో వామపక్ష, దళిత-బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. లా కాలేజీ ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ప్రొఫెసర్లు నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వరకు వెళ్లారు.

 అక్కడ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికార బీజేపీ ఏజెంట్‌‌గా మారారన్నారు. చట్ట సవరణల ద్వారా కమిషనర్‌‌పై ఎలాంటి సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా మినహాయింపులు ఇస్తూ, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాలరాసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. జ్ఞానేష్ కుమార్‌‌ను అరెస్ట్ చేసి, ఓట్ల తొలగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేసే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, జార్జి రెడ్డి పీడీఎస్‌‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి అజయ్, పీడీఎస్‌‌యూ  రాష్ట్ర కార్యదర్శి అనిల్, ఏఐడీఎస్‌‌ఓ నితీష్, విశ్వ విద్యార్థి సంఘం మహిపాల్, సత్య గ్యార నరేష్ కిరణ్ పెంచాల సతీష్ పాల్గొన్నారు.