హుస్నాబాద్, వెలుగు: శ్రీకర్ సీడ్స్ కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని, తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐవోసీ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 15 మంది రైతులు ఫిర్యాదు చేశారు.
అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన బదనపురం మొగిలి, జీలుగుల గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్‌రెడ్డి తమ వద్దకు వచ్చి శ్రీకర్ సీడ్స్ వరి విత్తనాలు సాగు చేస్తే ఎకరానికి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపారని రైతులు తెలిపారు.
వారి మాటలు నమ్మి గత యాసంగిలో 50 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన ధాన్యాన్ని తీసుకెళ్లినా డబ్బులు చెల్లించలేదని వాపోయారు. గతంలో హుస్నాబాద్ సీఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా, నెల రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని సదరు వ్యక్తులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలిపారు.
గడువు ముగిసినా చెల్లింపులు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు స్పందించి కంపెనీ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమ బకాయిలు ఇప్పించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
