న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి, ఇతర ప్రజా సంఘాల నిరసనల నేపథ్యంలో భద్రత కోసం మోహరించిన 20 వేల మంది పారామిలిటరీ సిబ్బంది మరో నెల రోజుల పాటు అక్కడే కొనసాగనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే పండుగల సీజన్ ప్రారంభం కానుండటం, మార్కెట్లు, ఇతర ప్రజా వేదికల్లో జనం రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ బలగాలను పొడిగించాలని నిర్ణయించారు.
అదేవిధంగా నిరసనల వేదికగా ఉన్న కీలక ప్రాంతాల్లో మార్పులు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటివరకు ప్రధాన నిరసన కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్ హోదాను రద్దు చేశారు. ఇండియా కూటమి నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు నగర సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు హోటళ్లు, లాడ్జీలు, ధర్మశాలల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్‌ను 20 జోన్లుగా విభజించి, జాయింట్ కమిషనర్లు, డీసీపీల పర్యవేక్షణలో భద్రతను సమీక్షిస్తున్నారు. ఇక దీనిని కేవలం రాజకీయ నిరసనగానే కాకుండా విద్యార్థులు, పౌర సమాజం భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య ఉద్యమంగా మలచేందుకు ఇండియా కూటమి వ్యూహరచన చేస్తోంది.
