న్యూఢిల్లీ: దేశంలో చట్టబద్ధంగా, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం బార్ అసోసియేషన్ సభ్యులకు, న్యాయవాదులకు ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ), ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పలువురు సీనియర్ అడ్వకేట్లను పోలీసులు రోడ్లపై ఈడ్చుకెళ్లారని, ముందస్తు సమాచారం లేకుండా నిర్బంధించారని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పోలీసుల మితిమీరిన ప్రవర్తనను, అక్రమ నిర్బంధాలను కోర్టు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిర్దేశిత ప్రాంతాలలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు న్యాయవాదులకు కచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించింది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రమశిక్షణతో కూడిన శాంతియుత ఆందోళనలు భాగమేనని, శాంతియుత నిరసనలపై పోలీసులు మితిమీరిన బలాన్ని ఉపయోగించకూడదని సూచించింది. ఆయుధాలులేని పౌరులను అక్రమంగా నిర్బంధించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
