ఈసీ బీజేపీ  జేబు సంస్థా? రాంచందర్ రావుకు మంత్రి పొన్నం కౌంటర్

ఈసీ బీజేపీ  జేబు సంస్థా? రాంచందర్ రావుకు మంత్రి పొన్నం కౌంటర్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సంఘాన్ని జేబు సంస్థలా భావించే మాటలు ఇకనైనా బంద్ చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, తొలగింపు అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయితే తామే జాబితాలో చేర్చుతామని రాంచందర్ రావు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ నేతలే ఎన్నికల సంఘం అధికారులుగా వ్యవహరించాలని అనుకుంటున్నారా... అని మండిపడ్డారు. 'ఓట్లు తొలగించబడ్డ బాధితులను తీసుకువస్తాం, ఏసీ గదుల్లో కూర్చొని సవాళ్లు విసరడం కాదు, ఏయే బూత్ లో ఓట్లు తొలగించబడ్డాయో క్షేత్ర స్థాయిలో విచారణకు సిద్ధమా'  అని ఛాలెంజ్ చేశారు. తమవి ఆరోపణలు కాదని, ఆధారాలతో మాట్లాడుతున్నామన్నారు. డ్రామాలు, డైవర్షన్ లను పక్కనపెట్టి, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేయాలని  కోరారు.