- చికిత్స చార్జీల వివరాలు ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
- అన్ని రాష్ట్రాలు, యూటీల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ
- విదేశీ రోగులకు అందించే ప్యాకేజీల ధరలనూ చూపాలని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు, హాస్పిటల్స్‌లో వివిధ వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ఛార్జీల వివరాలను రోగులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులపై ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం 2010, కేంద్ర నిబంధనలు 2012 ప్రకారం రోగులు, వారి సహాయకులకు సులువుగా తెలిసేలా స్థానిక భాషతో పాటు ఇంగ్లిష్‌లోనూ సేవల రేట్ల వివరాలను ప్రముఖ ప్రదేశాల్లో తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలని సూచించారు.
ఈ చట్టం పరిధిలోకి రాని రాష్ట్రాలు కూడా తమ సంబంధిత నిబంధనల ప్రకారం ప్రైవేట్, ఇతర హెల్త్ సెంటర్లలో ధరల పట్టికలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో తగిన మార్గదర్శకాలు జారీ చేసి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సీఎస్‌లను కోరారు. వైద్య ఖర్చులపై రోగులు, వారి కుటుంబాలకు ముందస్తు అవగాహన కల్పించడం, బిల్లింగ్ విషయంలో తలెత్తే అనవసర వివాదాలకు అడ్డుకట్ట వేసి ఆరోగ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా మెడికల్, ఆయుష్ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సైతం ప్యాకేజీ రేట్ల వివరాలను ప్రదర్శించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీనివల్ల అంతర్జాతీయ రోగులు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలగడంతో పాటు, మెడికల్ టూరిజంలో భారతదేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని వివరించారు. ఈ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రేట్ల వివరాలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
