మరో స్వాతంత్ర్య పోరాటం.. దళితులు, గిరిజనులు, పేదల ఓట్లే టార్గెట్: సీఎం రేవంత్ రెడ్డి

మరో స్వాతంత్ర్య పోరాటం.. దళితులు, గిరిజనులు, పేదల ఓట్లే టార్గెట్: సీఎం రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ, వెలుగు: దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు కాంగ్రెస్‌‌ పోరాడుతున్నదని, ఇది మరో స్వాతంత్య్ర ఉద్యమ‌‌మ‌‌ని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీ, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతోందని అన్నారు. 

బ్రిటిష్‌‌ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ, స్వపరిపాలన కల్పించేందుకు ఆనాడు కాంగ్రెస్‌‌ నాయకులు పోరాడారని, ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.‘ఓట్‌‌ బ‌‌చావో.. దేశ్ బ‌‌చావో’ ఆందోళ‌‌న‌‌లో భాగంగా cతెలంగాణ భ‌‌వ‌‌న్‌‌లో సోమ‌‌వారం నిర్వహించిన స‌‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

ఆనాడు స్వాతంత్య్రం కోసం ‘సైమన్‌‌ గో బ్యాక్‌‌’ ఉద్యమం సాగిందని, ఇప్పుడు ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్‌‌ గో బ్యాక్‌‌’, ‘సర్‌‌‌‌ గో బ్యాక్‌‌’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. భార‌‌త‌‌ ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కమిషనర్‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌ను ముందుపెట్టి, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు.   

గతంలో ఓటు హక్కు కల్పించేందుకు ‘సర్‌‌‌‌’

గతంలోనూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌‌‌‌) ప్రక్రియ జరిగిందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. 1950లో జవహర్‌‌లాల్‌‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ద్వారా అర్హులకు ఓటు హక్కు కల్పించార‌‌ని గుర్తు చేశారు.  తర్వాత ఇందిరాగాంధీ, అటల్‌‌ బిహారీ వాజ్‌‌పేయి ప్రభుత్వాల కాలంలోనూ ‘సర్‌‌‌‌’ ప్రక్రియ కొనసాగిందని గుర్తు చేశారు. అయితే, గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారని అన్నారు. 

ఇప్పుడు మోదీ, అమిత్‌‌ షా పాలనలో మాత్రం ఇప్పటికే ఓటు హక్కు ఉన్నవారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీఎం మండిప‌‌డ్డారు.  తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం గ‌‌తంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, నార్కోటిక్స్‌‌ విభాగంలాంటి సంస్థలను ఉపయోగించుకున్నదని, ఇప్పుడు వాటితో రాజకీయ‌‌ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ‘సర్‌‌‌‌’ను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.   

గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్‌‌ నేతృత్వంలో పనిచేసేదని, అయితే, ఈ సంస్థలో మ‌‌రింత పారదర్శకత తీసుకువ‌‌చ్చేందుకు ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నేత భాగస్వామ్యంతో నియామక ప్రక్రియ సాగేదన్నారు. 

మోదీ ప్రభుత్వం 2023లో ఈ విధానాన్ని మార్చిందని  తెలిపారు. క‌‌మిష‌‌న‌‌ర్ల నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చారని చెప్పారు. నిర్ణయాలను తమకు అనుకూలంగా తీసుకునేందుకే ఈ మార్పులు చేశారని సీఎం రేవంత్‌‌ మండిప‌‌డ్డారు. 

దళితులు, గిరిజనులు, పేదల ఓట్లే లక్ష్యమా?

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓటు హక్కును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆరోపించారు. దేశ యువత ఓట్లను తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మండిప‌‌డ్డారు. సోషల్‌‌ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని లక్ష్యంగా చేసుకొని వారి ఓటు హక్కును తొలగించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రమాదాన్ని తొలుత గుర్తించి దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది రాహుల్ గాంధీయేనని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలే కాకుండా అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నార‌‌ని చెప్పారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్‌‌ జోషిలాంటి వారు ఈ అంశంపై గొంతెత్తడమే ఇందుకు సంకేతమని వ్యాఖ్యానించారు.

మోదీ, అమిత్‌‌ షా మౌనం దేనికి సంకేతం? 

జ్ఞానేశ్‌‌ కుమార్ నియామ‌‌కంలో ఎలాంటి కుట్ర లేదని మోదీ, అమిత్‌‌ షా భావిస్తే, ఆయనను తొలగించాలనే డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు వారు ఎందుకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని అడిగారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారని, నిరసనలను ఎందుకు అణచివేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో భారీగా పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారో వివరించాలన్నారు.  

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రేవంత్‌‌రెడ్డి తెలిపారు. 2019లో ఈ సంఖ్య సుమారు 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి సుమారు 97 కోట్లకు చేరిందని వివ‌‌రించారు.  2026లో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ తొల‌‌గించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో దేశ జనాభా ఎంత? ప్రస్తుతం ఎంత? అనే వివరాలను పరిశీలించాలన్నారు. జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణమేంటని సీఎం ప్రశ్నించారు.  ఈ అంశంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని కోరారు.   

రాహుల్ నాయకత్వంలో పోరాటం

ఆనాడు ‘సైమన్‌‌ గో బ్యాక్‌‌’ నినాదం స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. ఇప్పుడు రాహుల్‌‌గాంధీ నేతృత్వంలో సాగుతున్న ‘జ్ఞానేశ్‌‌ గో బ్యాక్‌‌’ ఉద్యమం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ఓటు హక్కును కాపాడేందుకు దోహదపడుతుందని చెప్పారు. 

గాంధీ కుటుంబం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాహుల్‌‌గాంధీ ‘ఓట్‌‌ చోరీ’ ప్రచారం ద్వారా ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు, పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌, ఏఐసీసీ పరిశీలకుడు సచిన్‌‌ సావంత్‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.