- లాఠీలకు భయపడొద్దు పార్టీ శ్రేణులకు సీఎం, పీసీసీ చీఫ్ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగించాలని, పార్టీ అధిష్టానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఢిల్లీని విడిచి వెళ్లొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటంలో క్రియాశీలంగా పాల్గొనాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కవిుషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఓటు- హక్కు పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు సమన్వయంతో వ్యవహరించాలని వారు సూచించారు.
రాహుల్ గాంధీ పిలుపు మేరకు చేపట్టే తదుపరి కార్యాచరణలో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా అందుబాటు-లో ఉండాలని, అధిష్టానం ఆదేశాల ప్రకారం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ నేతలు
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్, బారాఖాంబా రోడ్డులో జరిగిన నిరసనలో పలువురు తెలంగాణ నేతలకు గాయాలయ్యాయి.
తోపులాట, లాఠీచార్జిలో దెబ్బలు తగిలాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, మందుల సామేల్, వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్, జయవీర్ రెడ్డి, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆది శ్రీనివాస్, రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. బారాఖాంబ రోడ్‌లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం రాహుల్‌తో కలిసి పాదయాత్రగా కదిలారు.
24 గంటలూ హెల్ప్ డెస్క్: సీఎం
ఢిల్లీ వచ్చిన నేతలు ఎవరూ చెప్పే వరకూ ఇక్కడినుంచి వెళ్లొద్దని సీఎం రేవంత్ సూచించారు. ఈ ఉద్యమం ఒక్కరోజుతో అయ్యేది కాదని అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నిరోజులు అని చెబుతారో తెలియదని, కాబట్టి రిటర్న్ టికెట్స్ ఎవరూ బుక్ చేసుకోవద్దని సూచించారు. ఢిల్లీకి వచ్చిన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వారందరికీ సాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ అవసరమని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిని విడిపించేందుకు ఎవరి స్థాయిలో వాళ్లు పని చేయాలన్నారు. హెల్ప్ డెస్క్ 24 గంటలూ పని చేసేలా అందుబాటులో ఉండాలని ఎంపీలకు సూచించారు.
జాతీయ నేతలతో రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి జాతీయ నేతలతో కలిసి ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి నడిచారు. బస్‌లో సుప్రియా సూలే, ఇతర ఎంపీలతో అభివాదం చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కర్నాటక సీఎం డీకే శివకుమార్‌తో కొద్దిసేపు ముందుకు కదిలారు. పెద్ద ఎత్తున అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని వెళ్లారు. సుప్రీం కోర్టులో రాహుల్ వెంట నిలిచి పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు సైతం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
