- నిందితుడు బిహార్‌కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డుగా గుర్తింపు
- మల్కాజిగిరి డీసీపీ ఆఫీస్ ఎదుట కాలనీవాసుల ఆందోళన
- నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్
పద్మారావునగర్, వెలుగు: ఈజీ మనీ కోసం మాజీ సెక్యూరిటీ గార్డు చిన్నారి ప్రాణాలను తీసిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది. కౌకూర్‌లోని 'విల్లా ఆర్కిడ్స్' గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసును మల్కాజిగిరి పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్కుమార్గా గుర్తించారు. సోమవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుమతి కేసు వివరాలను వెల్లడించారు.
కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న ఐదేళ్ల బాలిక ఆరేలియా అలియాస్ మోను ప్రీ-ప్రైమరీ 2 చదువుతోంది. ఈ నెల 10న సాయంత్రం సైకిల్ తొక్కేందుకు సమీపంలోని క్లబ్‌హౌస్ గేమ్స్ జోన్‌కు చిన్నారి వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండాపోయింది. ఆ సమయంలో బాలిక తండ్రి మొబైల్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
చిన్నారి తన వద్దే ఉందని, క్షేమంగా కావాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాధితుడి వెంటనే బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి జోన్, ఎస్వోటీ, క్రైమ్స్ విభాగాలతోపాటు స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన సుమారు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గేటెడ్ కమ్యూనిటీ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దురదృష్టవశాత్తూ క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో బాలిక విగతజీవిగా కనిపించింది.
విచారణ వేగవంతం..
చిన్నారి హత్యకు గురికావడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలను, అనుమానితుల కదలికలను నిశితంగా పరిశీలించాయి. అదే కమ్యూనిటీలో పనిచేసిన బిహార్ నలంద జిల్లాకు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్‌కుమార్‌పై అనుమానం వచ్చింది.
దీంతో అక్టోబర్ 11న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
డీసీపీ ఆఫీస్ ముట్టడి..
ఈ అమానుష ఘటనను నిరసిస్తూ ఆర్కిడ్ విల్లా కాలనీవాసులు, చిన్నారి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున మల్కాజిగిరి డీసీపీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. "వి వాంట్ జస్టిస్" అంటూ నినదించారు. మరో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు.
