ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం పిరికిపంద చర్య : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం పిరికిపంద చర్య : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కేంద్ర ప్రభుత్వంపై  ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: శాంతియుత నిరసనలకు వేదికైన జంతర్ మంతర్‌‌ను అడ్డుకోవడం, ప్రతిపక్షాలపై పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం బీజేపీ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సుప్రీంకోర్టు మార్చ్‌‌’ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచీ, కొన్ని దశాబ్దాలుగా శాంతియుత నిరసనలకు అధికారిక వేదికగా ఉన్న జంతర్ మంతర్‌‌ను ప్రొటెస్ట్ సైట్ కాకుండా తొలగించడం (డి-నోటిఫై చేయడం) కంటే పిరికితనం మరొకటి ఉండదని అన్నారు. ప్రజల గళాన్ని వినడానికి పాలకులు ఎంతగా భయపడుతున్నారో ఈ చర్య స్పష్టం చేస్తోందని విమర్శించారు.

ప్రతి పౌరుడికీ నిరసన తెలిపే హక్కు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21, 22 ప్రకారం ప్రతి పౌరుడికీ శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేసే ప్రాథమిక హక్కు ఉందని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఆ హక్కులను కాలరాయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకోలేకపోయారని తెలిపారు.

అయితే, గత వారం రోజులుగా తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులపై మహిళలు, యువత అని కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా లాఠీచార్జీలు చేశారని, అరెస్టులతో దౌర్జన్యాలకు తెగబడ్డారని తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు, దౌర్జన్యాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు లెక్కచేయలేదని, ఢిల్లీ వీధుల్లో వేలాది మందితో ఇంత భారీ ఎత్తున శాంతియుత ర్యాలీ అత్యంత విజయవంతంగా సాగిందని ఆయన వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి తమ పోరాటం ఆగదని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు