సర్కారు బడుల్లో సర్దుబాటు సరిపోలే..కొత్త నియామకాల ఊసేలే!

సర్కారు బడుల్లో సర్దుబాటు సరిపోలే..కొత్త నియామకాల ఊసేలే!
  •     1,713 మంది టీచర్లు కావాలన్నా కదలని ఫైల్
  •     6,200 మంది సర్ ప్లస్ టీచర్లను అడ్జస్ట్ చేసినా తీరని కొరత
  •     ఉర్దూ మీడియంలో 540 మంది ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లు అవసరం
  •     విద్యాశాఖకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రపోజల్స్

 


 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల కొరత తీర్చేందుకు చేపట్టిన సర్దుబాటు నామమాత్రంగానే మారింది. 6 వేల మందికి పైగా మిగులు టీచర్లను సర్దుబాటు చేసినా క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. బడుల్లో బోధన ఆగకుండా ఉండేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లను నియమించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కసరత్తు చేసినా.. ఆ ఫైల్ ముందుకు కదలడం లేదు. సాధారణ, ఉర్దూ మీడియం బడుల్లో కలిపి మొత్తం 1,713 మందిని నియమించాలంటూ నాలుగు నెలల కిందటే విద్యాశాఖకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుంచి ప్రపోజల్స్ పంపించారు.

అయితే, దీనికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో ఆ ఫైల్ ఆగిపోయిందని ఆఫీసర్లు చెప్తున్నారు. విద్యాసంవత్సరం ఆరంభంలోనే బడుల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేపట్టారు. కలెక్టర్ల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,200 మంది మిగులు టీచర్లను అవసరం ఉన్న బడులకు డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పంపించారు. కానీ, యూడైస్ విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే.. ఇంత మందిని సర్దుబాటు చేసిన తర్వాత కూడా వందలాది బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని తేలింది. ప్రైమరీ, హైస్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్టులకు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

టీచర్లు అవసరమైనా..

జనరల్ స్కూళ్లలో 1,173 మంది అవసరమని అధికారులు తేల్చారు. దీంట్లో ప్రైమరీ స్కూళ్ల ఖాళీలే 439 ఉన్నాయి. హైస్కూళ్లలో లాంగ్వేజ్–2 (276), లాంగ్వేజ్–1 (103), మ్యాథ్స్ (84), ఇంగ్లిష్ (81), సోషల్ (77), బయాలజీ (61), ఫిజికల్ సైన్స్ (52) పోస్టుల కొరత ఉంది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 471, జోగుళాంబ గద్వాలలో 345, నారాయణపేటలో 129 మంది ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్ల అవసరం ఉంది. రాష్ట్రంలోని 462 ఉర్దూ స్కూళ్లలో చదువుతున్న 25,912 మంది పిల్లల కోసం 540 మంది టీచర్లు కావాలని తేల్చారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 93, కామారెడ్డిలో 62, ఆదిలాబాద్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాల్లో చెరో 60 మంది టీచర్లు అవసరమున్నారు.

ఎప్పుడు నియమిస్తారో..

కరోనా కాలం నుంచి రాష్ట్రంలో విద్యావలంటీర్ల వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో చాలా గ్రామాల్లో ఏకోపాధ్యాయ బడులు నడుస్తుండగా, హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేక పదో తరగతి విద్యార్థుల సిలబస్ వెనుకబడుతోంది. ప్రభుత్వానికి నివేదిక చేరి నాలుగు నెలలు దాటినా ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం, విద్యాశాఖ పోస్టులను సాంక్షన్ చేయకపోవడంతో అయోమయం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే అకాడమిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లను నియమించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ 
కోరుతున్నారు.
 
రూ.26.72 కోట్లు కావాలి..

ఆర్థిక శాఖ జీవో 60 ప్రకారం అకాడమిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లకు నెలకు రూ.15,600 గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలకు జనరల్ స్కూళ్లకు రూ.18.29 కోట్లు, ఉర్దూ స్కూళ్లకు రూ.8.42 కోట్లు కలిపి మొత్తం రూ.26.72 కోట్లు అవసరం ఉంటుందని, ఆ నిధులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కోరారు. ప్రస్తుత బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీని కోసం నిధులు కేటాయించకపోవడంతో స్పెషల్ సాంక్షన్ తప్పనిసరి అయింది.