'రామాయణం'లో జటాయువుగా అనుపమ్ ఖేర్.. అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్!

'రామాయణం'లో జటాయువుగా అనుపమ్ ఖేర్.. అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ ఎపిక్‌ 'రామాయణం' (Ramayana). బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది.  లేటెస్ట్ గా ఈ చిత్రంలో కీలకమైన జటాయువు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

జటాయువుగా అనుపమ్ ఖేర్..!

రామాయణంలో జటాయువు పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్న సమయంలో ఆమెను రక్షించేందుకు జటాయువు ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. శక్తివంతమైన రావణుడిని ఎదుర్కొంటూ ధర్మం కోసం చివరి శ్వాస వరకు నిలబడే జటాయువు త్యాగం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి ఈ కీలకమైన పాత్రకు అనుపమ్ ఖేర్ తన గాత్రం అందించనుండటంతో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

రిలీజ్ ఎప్పుడంటే?

నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం 'రామాయణం: పార్ట్ 1'ను 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 20న దసరా సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, అరుణ్ గోవిల్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

►ALSO READ | సెన్సార్‌షిప్‌తో క్రియేటివిటీకి సంకెళ్లు.. 35 ఏళ్ల నాటి పాత చట్టాలు మారేదెప్పుడు? : చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ!

నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు కొత్త అనుభూతితో పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జటాయువు ఫస్ట్ లుక్‌తో మరింత ఆసక్తి పెరిగిన నేపథ్యంలో.. తదుపరి పాత్రల పోస్టర్లు ఎప్పుడు విడుదలవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.